నాలుగు గంటలు నరకం
ABN , Publish Date - Oct 19 , 2024 | 11:53 PM
పార్వతీపురం నుంచి కూనేరు వరకు ఉన్న అంతర్రాష్ట్ర రహదారిపై ఏర్పడిన గోతుల్లో రెండు లారీలు దిగబడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
భారీగా నిలిచిన వాహనాలు
కొమరాడ, అక్టోబరు 19 ఆంధ్రజ్యోతి : పార్వతీపురం నుంచి కూనేరు వరకు ఉన్న అంతర్రాష్ట్ర రహదారిపై ఏర్పడిన గోతుల్లో రెండు లారీలు దిగబడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సుమారు నాలుగు గంటల పాటు ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో కొమరాడ మండలం గుమడ వద్ద ఒడిశా వైపు నీలగిరి కర్రల లోడ్‌తో వెళ్తున్న లారీ, కూనేరు వద్ద ఒడిశా నుంచి పార్వతీపురం వైపు వస్తున్న గూడ్స్ లారీ గోతుల్లో కూరుకుపోయాయి. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నాలుగు గంటల పాటు వాహనదారులకు నిరీక్షణ తప్పలేదు. చివరకు లారీ కార్మికులు ఎక్స్‌కవేటర్ సాయంతో గోతుల్లో పడిన లారీలను పక్కకు తప్పించారు. ఆ తర్వాత యథావిఽధిగా వాహన రాకపోకలు సాగాయి. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చు కున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నాలుగు రాష్ట్రాలకు కీలకమైన అంతర్రాష్ట్ర రహదారి మరమ్మతులకు చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.