ఈ-క్రాప్ గడువు పెంపు
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:15 AM
జిల్లా పరిధిలో ఈ-క్రాప్ నమోదు గడువును ఉన్నతాధికారులు పెంచారు. వాస్తవంగా 15 మండలాల్లో ఈ నెల 15 నాటికి ఈ-క్రాప్ పూర్తి చేయాల్సి ఉంది. అయితే నిర్దేశించిన లక్ష్యాల మేరకు నమోదు కాకపోవడంతో మరో 15 రోజులు సమయం పెంచారు.
గరుగుబిల్లి, సెప్టెంబరు 15 : జిల్లా పరిధిలో ఈ-క్రాప్ నమోదు గడువును ఉన్నతాధికారులు పెంచారు. వాస్తవంగా 15 మండలాల్లో ఈ నెల 15 నాటికి ఈ-క్రాప్ పూర్తి చేయాల్సి ఉంది. అయితే నిర్దేశించిన లక్ష్యాల మేరకు నమోదు కాకపోవడంతో మరో 15 రోజులు సమయం పెంచారు. ఈ నెల 30లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుత ఖరీఫ్‌లో సాగు చేస్తున్న పంటల వివరాలను సమీప రైతుసేవా కేంద్రాల్లోని సిబ్బందికి అందించాల్సి ఉంది. సాగు చేస్తున్న భూమి సర్వే నెంబరు, విస్తీర్ణం, పంట రకం, పాస్ పుస్తకం, ఆధార్‌తో పాటు ఫోన్ నెంబరు అందించాలి. సంబంధిత సిబ్బంది సాగు చేస్తున్న పంటను జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంది. ఈ-క్రాప్ నమోదు తదుపరి సమాచారం రైతులకు చెందిన సెల్ ఫోన్లకు చేరుతుంది. ఈ-క్రాప్ నమోదులో పలు ప్రోత్సాహకాలు, రాయితీలు పొందొచ్చు. తుఫాన్ సమయంలో పంటలకు నష్టాలు కలిగితే తగిన పరిహారం పొందొచ్చు. జిల్లాలో 2.66 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 94 శాతం మేర ఈ-క్రాప్ , ఈకేవైసీ 60 శాతం మేర పూర్తయింది. ఈ నెల 30లోగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేస్తామని ఏవోఆర్.విజయభారతి తెలిపారు.