తాగునీటినీ నిర్లక్ష్యం చేశారు
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:13 AM
తాగునీటిని కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, కనీసం వాటర్ ట్యాంక్ నీటిని శుద్ధి చేసే ఫిల్టర్ బెడ్లను మార్చలేకపోయిందని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు లేక అధికారులు నాడు ఏమి చేయలేక నిరుత్సాహంలో ఉండిపోయారన్నారు.
తాగునీటినీ నిర్లక్ష్యం చేశారు
ఫిల్టర్ బెడ్లను మార్చాలన్న ఆలోచనా రాలేదా?
15వ ఆర్థిక సంఘం నిధులు దారిమళ్లించారు
నిఽధులు లేక నిరుత్సాహంలో అధికారులు
వైసీపీ నాటి తప్పులను సరిదిద్దుతున్నాం
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్
విజయనగరం/కలెక్టరేట్ అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): తాగునీటిని కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, కనీసం వాటర్ ట్యాంక్ నీటిని శుద్ధి చేసే ఫిల్టర్ బెడ్లను మార్చలేకపోయిందని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు లేక అధికారులు నాడు ఏమి చేయలేక నిరుత్సాహంలో ఉండిపోయారన్నారు. సోమవారం గుర్లలో పర్యటించిన అనంతరం ఆయన కలెక్టరేట్‌లో ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 10 మంది చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. గుర్ల ఘటనపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్‌ను నియమించారని, అసలు డయేరియా విస్తరించడానికి కారణాలేంటో తేల్చాకే మృతులు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తాను మానవతాదృక్పథంతో ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించారు.
ఫ గుర్లలో చంపావతి పంప్‌హౌస్ పరిశీలించానని, ఒక లైను ద్వారా గుర్లకు మరో లైన్ ద్వారా గరివిడికి నీరు వెళ్తోందని, గుర్ల వెళ్లే లైన్‌లో కలుషితం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. బహిరంగ మలవిసర్జన కూడా నీరు కలుషితం కావడానికి ఒక కారణంగా అధికారులు చెబుతున్నారని బహిరంగ మల విసర్జనను వెంటనే ఆపాలని సూచించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో చెత్తాచెదారం ఉంటే కాలుష్యం పెరుగుతుందని చెప్పారు. నీటి వనరులన్నింటినీ పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సమీక్షలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు కిమిడి కళా వెంకటరావు, కోళ్ల లలిత కుమారి, పూసపాటి అదితి గజపతిరాజు, లోకం నాగమాధవి, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఎండీ గంథం చంద్రుడు, కలెక్టరు అంబేడ్కర్, పార్వతీపురం కలెక్టర్ శ్యాంప్రసాద్, జేసీ సేతు మాధవన్ తదితరులు పాల్గొన్నారు.
-----------------
డయేరియా బాధితులకు డిప్యూటీ సీఎం పరామర్శ
నెలిమర్ల, గుర్లలో పర్యటన
రక్షిత నీటి పథకం పంప్‌హౌస్ పరిశీలన
గుర్ల, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): డయేరియా బాధితులను డిప్యూటీ సీఎం..గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రి పవన్‌కల్యాణ్ సోమవారం పరామర్శించారు. గుర్ల గ్రామ పరిసరాలతో పాటు తాగునీరు సరఫరా అవుతున్న ఎస్‌ఎస్‌ఆర్ పేట పంపుహౌస్ గురించి, ఆస్పత్రిలో బాధితులకు అందుతున్న సేవలపైనా ఆరా తీశారు. తొలుత సోమవారం ఉదయం చంపావతి నదిలో ఎస్‌ఎస్‌ఆర్‌పేట వద్దనున్న పంపుహౌస్‌ను పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే కళావెంకటరావు, నెలిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, ఎంపీ అప్పలనాయుడు, జిల్లా జనసేన, బీజేపీ నాయకులు ఆయన వెంట ఉన్నారు. పవన్‌కల్యాణ్ పంపుహౌస్‌లోకి వెళ్లి అక్కడి అధికారులతో మాట్లాడారు. సుమారు 24 గ్రామాలకు, రెండు మండలాలకు నీరు సరఫరా అవుతున్నట్లు తెలుసుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి గుర్ల పీహెచ్‌సీకి చేరుకున్నాక రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని రోగులను అడిగారు. ఆ తర్వాత గ్రామంలోకి వెళ్లారు. రామమందిరం సమీపంలో ఉన్న కలిశెట్టి సీతమ్మ ఇంటి వద్దకు వెళ్లారు. మిగతా బాధిత కుటుంబాలను అక్కడికి పిలిచి అందరితో మాట్లాడారు. ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. చంపావతి నది కలుషితం అవుతోందని, అందులో నుంచి వచ్చే నీరు కూడా కలుషితం అవుతోందని కొంతమంది పవన్‌కల్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు.
పోలీసుల అత్యుత్సాహం
విజయనగరం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): డయేరియా బాధితులను పరామర్శించడానికి సోమవారం గుర్ల వచ్చిన పవన్‌కల్యాణ్ పర్యటనలో జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆసుపత్రిని పరిశీలించిన డిప్యూటీ సీఎం ఆ తర్వాత గుర్ల గ్రామంలోకి వెళ్లారు. ఆ సమయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కారుకు పోలీసులు దారి ఇవ్వకపోవడంతో ఆయన కారు వదిలి గ్రామంలోకి వెళ్లారు. కలెక్టరేట్‌లో సమీక్ష సమయంలో లోపలికి వెళ్లేందుకు డీఆర్వో అనిత ప్రయత్నించగా ఆమెను కూడా చాలాసేపటి వరకు నిలిపివేశారు. గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీదారులు పోలీసుల తీరుతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కాన్వాయ్ ఆపి.. దివ్యాంగురాలి గోడు విని
నెల్లిమర్ల, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): విజయనగరం నుంచి సోమవారం కాన్వాయ్‌గా గుర్ల వెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మార్గమధ్యలో నెల్లిమర్ల ఫ్లైఓవర్ వంతెన సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న నెల్లిమర్ల మండలం మెయిద గ్రామానికి చెందిన దివ్యాంగురాలు జి.రమాదేవిని చూసి కారు ఆపారు. కిందకు దిగి ఆమె వద్దకు వెళ్లి సమస్యను తెలుసుకున్నారు. తనకు 90 శాతం దివ్యాంగత్వం ఉన్నా రూ.6 వేలు మాత్రమే పింఛన్ ఇస్తున్నారని, తనలా ఉన్నవారికి రూ.15వేలు ఇవ్వాల్సి ఉందని చెప్పింది. వెంటనే పవన్‌కల్యాణ్ అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆమె అనందంతో మురిసిపోయింది.
------------