Share News

అంతిమ సంస్కారాలకు అవస్థలు

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:18 AM

శివరాంపురం వద్ద వేగావతి నదిపై వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంతో గ్రామస్థులకు తిప్పలు తప్పడం లేదు. చివరకు అంతిమ సంస్కారాలకు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

 అంతిమ సంస్కారాలకు అవస్థలు
కాజ్‌వేపై వరద దాటి శ్మశానానికి వెళ్తున్న దృశ్యం

సాలూరు రూరల్‌, సెప్టెంబరు 15: శివరాంపురం వద్ద వేగావతి నదిపై వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంతో గ్రామస్థులకు తిప్పలు తప్పడం లేదు. చివరకు అంతిమ సంస్కారాలకు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆదివారం ఆ గ్రామంలో కనకల అప్పలనర్సమ్మ (64) మృతి చెందింది. అయితే అంత్య క్రియల కోసం శ్మశానికి బయల్దేరిన కుటుంబ సభ్యులు నానా అవస్థలు పడ్డారు. మార్గమధ్యంలో ఉన్న కాజ్‌వేపై నాచు, వరద ఎక్కువగా ఉండడంతో మోకాళ్ల లోతు నీటిలో పాడెను మోసుకుంటూ అతి కష్టం మీద నదిని దాటారు. ఏటా వర్షాకాలంలో తమకీ ఇబ్బందులు తప్పడం లేదని, వంతెన నిర్మాణం పూర్తయితే ఇక్కట్లు తప్పుతాయని వారు వాపోతున్నారు. వాస్తవంగా వంతెన నిర్మాణానికి 2007లో రూ. 3 కోట్లు మంజూరవగా.. రూ.కోటితో స్తంభాలు నిర్మించి వదిలేశారు. గత ప్రభుత్వం రూ. 5.95 కోట్లు మంజూరు చేసినా టెండర్లు పిలవ లేదు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:18 AM