ప్రజలకు అందుబాటులో ఉంటా
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:03 AM
న్యాయం కోసం వచ్చే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని విశాఖ రేంజ్ డీఐజీ విశాల్‌గున్ని అన్నారు. డీఐజీగా సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన తరువాత విలేకరులతో మాట్లాడారు.
ప్రజలకు అందుబాటులో ఉంటా
స్టేషన్ స్థాయిలోనే న్యాయం జరిగేలా చూస్తా
మావోయిస్టుల కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి
గంజాయి సాగు, రవాణాను నియంత్రిస్తాం
రేంజ్ డీఐజీ విశాల్ గున్ని
విశాఖపట్నం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి):
న్యాయం కోసం వచ్చే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని విశాఖ రేంజ్ డీఐజీ విశాల్‌గున్ని అన్నారు. డీఐజీగా సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన తరువాత విలేకరులతో మాట్లాడారు. పోలీస్ స్టేషన్ స్థాయిలోనే ప్రజలకు న్యాయం జరిగేలా చేయడమే తన ప్రథమ కర్తవ్యమన్నారు. ఆ విధంగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానన్నారు. రేంజ్ పరిధిలో ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి అన్ని విభాగాలను పటిష్ట పరిచేందుకు కృషిచేస్తానన్నారు. పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో మావోయిస్టుల కదలికలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని, ఏజెన్సీలో గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు విఘాతం లేకుండా చర్యలు తీసుకుంటామని, నిబంధనలకు లోబడి పనిచేస్తూ ముందుకువెళతామని చెప్పారు. సామాజిక మాధ్యమాల ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో కథనాలు ప్రచురించే ముందు వివరణ తీసుకోవాలని మీడియాను కోరారు. సోషల్ మీడియాలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి కథనాలు పోస్టు చేయడం వల్ల ప్రజలు అయోమయానికి గురవుతున్నారన్నారు. అందువల్ల ఒకటికి, రెండుసార్లు నిర్ధారణ చేసుకోవాలని విశాల్‌గున్ని అన్నారు. కాగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అన్ని జిల్లాల ఎస్పీలు, ఇతర అధికారులు మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిశారు.
శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ
విజయనగరం క్రైం, ఫిబ్రవరి 12: విశాఖపట్నం రేంజ్ డీఐజీగా బాధ్యతలు చేపట్టిన విశాల్ గున్నిని సోమవారం ఎస్పీ దీపిక విశాఖలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గున్ని విజయవాడ డీసీపీగా పనిచేస్తూ పదోన్నతిపై వచ్చారు. ఇక్కడ రేంజ్ ఐజీగా విధులు నిర్వహిస్తున్న ఎస్.హరికృష్ణ డీజీపీ కార్యాలయంలో ఐజీ పర్సనల్‌గా బదిలీ అయ్యారు. గున్ని 2013 నుంచి 2015 వరకు ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ ఏఎస్‌పీగా, పదోన్నతిపై ఓఎస్‌డీగా విశాఖ రూరల్‌లో పనిచేసిన అనుభవం ఉంది.