Share News

సమస్యల పరిష్కారానికి చర్యలు

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:28 AM

సాలూరు లోని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నివాసంలో ఆదివారం ప్రజాదర్బార్‌ కార్యక్రమం నిర్వహించా రు.

 సమస్యల పరిష్కారానికి చర్యలు

సాలూరు: సాలూరు లోని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నివాసంలో ఆదివారం ప్రజాదర్బార్‌ కార్యక్రమం నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో అనేక మంది తమ సమస్యలతో రాగా, మంత్రి వాటి పరిష్కారాని కి చర్యలు తీసుకున్నారు. పాచిపెంట మండలం గడివలస గ్రామానికి చెందిన బెవర త్రినాథ.. తనకు గత ప్రభుత్వం పింఛన్‌ రద్దు చేసిందని, పునరుద్ధరించాలని కోరగా.. ఆమె వెంటనే ఎంపీడీవోకు ఫోన్‌ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. సాలూరులోని మీసేవా కేంద్రంలో గతంలో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేసిన తమను తిరిగి ఉద్యోగులుగా చేర్చుకోవాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ జాయింట్‌ సెక్రటరీ రమణమూర్తితో పాటు పలువురు అధికారులు మంత్రిని కలిసి, తమ శాఖలో ఎప్పటి నుంచో అమలు కాని పదోన్నతులను అమలు చేయలని కోరగా.. మంత్రి దానికి సానుకూలంగా స్పందించారు. జాబితాను రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, సినియార్టీని ఆధారంగా చేసుకుని సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. నియోజకవర్గంలో ప్రతి గిరిజన సంక్షేమశాఖ పాఠశాల, కళాశాలలో ఎక్కడా కూడా సిబ్బంది లేరనే మాట వినపడకూడదని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు(చిట్టి) పరమేష్‌, కొరిపిల్లి సురేష్‌, హర్షవర్ధన్‌, తోపాటు పలువురు నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

మంత్రికి కృతజ్ఞతలు

ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కేసలి పంచాయతీ కుమ్మరివలస గ్రామానికి రూ.4కోట్లతో బీటీ రోడ్డు మంజూరు చేసినందుకు ఆ గ్రామస్థులు మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం సాలూరులోని ఆమె నివాసం వద్దకు వెళ్లి, ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Updated Date - Sep 16 , 2024 | 12:28 AM