సైద్ధాంతిక మానవతావాది ఏచూరి
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:32 AM
సైద్ధాంతిక విలువలు పాటిస్తూనే ఇతర రాజకీయ పార్టీల నాయకులతో సత్సంబంధాలు నెరపిన మానవతావాది సీతారాం ఏచూరి అని పలువురు వక్తలు కొనియాడారు.
సంస్మరణ సభలో కొనియాడిన వక్తలు
అనకాపల్లి టౌన్, అక్టోబరు 1: సైద్ధాంతిక విలువలు పాటిస్తూనే ఇతర రాజకీయ పార్టీల నాయకులతో సత్సంబంధాలు నెరపిన మానవతావాది సీతారాం ఏచూరి అని పలువురు వక్తలు కొనియాడారు. ఆయన వాదనలు ఇతర పార్టీలు కూడా కాదనలేనంత సహేతుకంగా ఉండేవన్నారు. దివంగత సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభ మంగళవారం ఇక్కడ పార్టీ మండల కన్వీనర్ గంటా శ్రీరామ్ అధ్యక్షతన జరిగింది. ఏచూరి చిత్రపటానికి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పూలమాల వేయగా, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, వివిధ రాజకీయ పార్టీల నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సంస్మరణ సభలో ఎమ్మెల్యే కొణతాల మాట్లాడుతూ, యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు, అనేక ప్రజా అనుకూల చట్టాలు రావడం వెనుక ఏచూరి కృషి ఉందన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, విశాఖ రైల్వేజోన్, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటాలకు సహకరించారని గుర్తు చేశారు. విశాఖపట్నంలో సీతారాం ఏచూరి విగ్రహం ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ, సీతారాం ఏచూరి దేశ రాజకీయాల్లో ముఖ్య పాత్ర నిర్వహించారన్నారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ ఏచూరి వంటి మహానాయకులను నేటి తరం రాజకీయ నేతలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం మాట్లాడుతూ భారత రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా చట్టసభల్లో, బయట ఏచూరి నిరంతరం పోరాడారని అన్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా తుది శ్వాస విడిచే వరకు పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు మీసాల సుబ్బన్న, టీడీపీ నాయకులు డాక్టర్ కేకేవీఏ నారాయణరావు, ఇతర పార్టీలకు చెందిన జి.కోటేశ్వరరావు, రాజాన దొరబాబు, కె.హరిబాబు, వైఎన్ భద్రం, అనకాపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంజేవీఎన్ కుమార్, యాదవ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు భరిణికాన సాయినాథరావు తదితరులు పాల్గొన్నారు.