సింహాద్రి ఎన్టీపీసీలో కార్మికుడి మృతి
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:15 AM
సింహాద్రి ఎన్టీపీసీలో మంగళవారం కాంట్రాక్టు కార్మికుడు మృతిచెందాడు. ఇందుకు సంబంధించి సీఐ జి.మల్లికార్జునరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
పరవాడ, అక్టోబరు 1 : సింహాద్రి ఎన్టీపీసీలో మంగళవారం కాంట్రాక్టు కార్మికుడు మృతిచెందాడు. ఇందుకు సంబంధించి సీఐ జి.మల్లికార్జునరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కలపాక పంచాయతీ మూలస్వయంభూవరం గ్రామానికి చెందిన పడాల నాగేశ్వరరావు(55) సింహాద్రి ఎన్టీపీసీలోని సీహెచ్‌పీ-1లో మోనిసా ఎరెక్టర్స్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ తరపున కొంతకాలం నుంచి కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం జనరల్ షిఫ్ట్‌కు వెళ్లాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో తోటి కార్మికులు సీపీఆర్ చేసి ఎన్టీపీసీకి చెందిన ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించారు. కానీ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. నాగేశ్వరరావుకు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహానికి బుధవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని, మృతుడిఇ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. కాగా పడాల నాగేశ్వరరావు కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు.