Share News

ఉల్లం‘గనుల’పై విజిలెన్స్‌!

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:52 AM

జిల్లాలో నల్లరాయి క్వారీలు, క్రషర్లలో పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. గురువారం పలు నల్లరాయి క్వారీల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు.. ఈ తనిఖీలు కొనసాగుతాయిని చెబుతుండడంతో అక్రమ క్వారీల నిర్వాహకుల వెన్నులో వణుకు మొదలైంది.

ఉల్లం‘గనుల’పై విజిలెన్స్‌!
రొంగలివానిపాలెంలో అనుమతి లేకుండా నడుపుతున్న నల్లరాయి క్వారీ

వైసీపీ హయాంలో రాయి క్వారీలు, క్రషర్లలో యథేచ్ఛగా అక్రమాలు

కూటమి ప్రభుత్వానికి పెద్దఎత్తున ఫిర్యాదులు

నల్లరాయి క్వారీలు, క్రషర్లలో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీలు

వివరాలను వెల్లడించడంలో గోప్యత పాటిస్తున్న అధికారులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో నల్లరాయి క్వారీలు, క్రషర్లలో పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. గురువారం పలు నల్లరాయి క్వారీల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు.. ఈ తనిఖీలు కొనసాగుతాయిని చెబుతుండడంతో అక్రమ క్వారీల నిర్వాహకుల వెన్నులో వణుకు మొదలైంది.

ఐదేళ్ల వైసీపీ పాలనలో జిల్లాలో నల్లరాయి క్వారీలు, క్రషర్లలో అక్రమాలు యథేచ్ఛగా సాగాయి. అనుమతులు లేకుండా క్వారీలు నిర్వహిస్తున్నప్పటికీ ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ గనులు, రెవెన్యూతోపాటు సంబంధిత నియంత్రణ శాఖల అధికారులు అక్రమ క్వారీలను కట్టడి చేయలేదు. ఇష్టారాజ్యంగా క్వారీలను ఏర్పాటు చేసి కొండలను పిండి చేశారు. నాడు జిల్లాకు చెందిన ఒక మంత్రి అనుచరులు, నల్లరాయి క్వారీలను తమ గుప్పెట్లో పెట్టుకుని అక్రమంగా వ్యాపారం చేసినట్టు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. స్థానికులు ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు.

అనకాపల్లి మండలం మార్టూరు, మాకవరం, మామిడిపాలెం, బవులువాడ, వూడేరు, తదితర గ్రామాల్లో క్వారీల నిర్వాహకులు అనుమతి పొందిన హద్దులను దాటి అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతున్నారు. కుంచంగి, కూండ్రం, రొంలివానిపాలెం, సీతానగరం, మామిడిపాలెంలో కొంతమంది వ్యక్తులు ఎటువంటి అనుమతులు లేకుండానే క్వారీలను నిర్వహిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా నల్లరాయి క్వారీల్లో అక్రమాలు కొనసాగుతూనే వుండడాన్ని కూటమి పార్టీల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో నల్లరాయి క్వారీల్లో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్‌, ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు కొద్ది రోజుల నుంచి క్వారీల్లో తనిఖీలు జరుపుతున్నారు. కానీ గోప్యత పాటిస్తూ తనిఖీల వివరాలను మీడియాకు వెల్లడించడంలేదు. కనీసం ఫిర్యాదు చేసిన వ్యక్తులకు కూడా చెప్పకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Nov 30 , 2024 | 12:52 AM