Share News

మరో రెండు రైతుబజార్లు

ABN , Publish Date - Nov 30 , 2024 | 01:10 AM

వినియోగదారుల డిమాండ్‌ మేరకు పోతినమల్లయ్యపాలెం, పెందుర్తిల్లో కొత్తగా రైతబజార్లు ఏర్పాటుకు ప్రతిపాదించామని జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ తెలిపారు.

మరో రెండు రైతుబజార్లు

  • పీఎం పాలెం, పెందుర్తిల్లో ఏర్పాటు

  • త్వరలో అందుబాటులోకి ఆరిలోవ, చిట్టివలస బజార్లు

  • రైతుబజార్ల చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగిస్తాం

  • జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌

విశాఖపట్నం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి):

వినియోగదారుల డిమాండ్‌ మేరకు పోతినమల్లయ్యపాలెం, పెందుర్తిల్లో కొత్తగా రైతబజార్లు ఏర్పాటుకు ప్రతిపాదించామని జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ తెలిపారు. శుక్రవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ రెండుచోట్లా రైతుబజార్ల ఏర్పాటు కోసం స్థలం చూస్తున్నామన్నారు. పెందుర్తిలో ఒక రైతుబజార్‌ ఉన్నా మరో ప్రాంతంలో ఏర్పాటుచేస్తామన్నారు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన ఆరిలోవ, చిట్టివలస రైతుబజార్లను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ రెండు బజార్లలో కార్యకలాపాలు చేపట్టేందుకు కొంత మేర నిధులు అవసరమని పేర్కొన్నారు. నగరంలో ఎంవీపీ కాలనీ, సీతమ్మధార, కంచరపాలెం, నరసింహనగర్‌, మధురవాడ రైతుబజార్ల చుట్టూ ఉన్న ఆక్రమణలపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. జీవీఎంసీ, పోలీసుల సాయంతో ఆక్రమణలు తొలగిస్తామని పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్‌ కంటే తక్కువ రేటుకు కందిపప్పు, బియ్యం విక్రయాల్లో రాష్ట్రంలోనే విశాఖపట్నం ప్రథమ స్థానంలో ఉందన్నారు. జిల్లాలోని అన్ని రైతుబజారుల్లో ఎంపిక చేసిన స్టాళ్లలో కందిపప్పు, బియ్యం విక్రయాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు.

ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో 25 వేల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. మొత్తం 40 రైతు సేవా కేంద్రాల పరిధిలో పది ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. ఇప్పటివరకూ 100 టన్నుల ధాన్యం సేకరించామన్నారు. గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో ఐదు వేల టన్నుల ధాన్యం సేకరించామని, అయితే ఈ ఏడాది లక్ష్యాన్ని మరింత ఎక్కువగా నిర్ణయించినందున అందుకు తగినట్టు ప్రణాళిక రూపొందించుకుని అమలు చేస్తున్నామని జేసీ తెలిపారు. ఽధాన్యం సరఫరా చేసే రైతులకు సంచులు ఇస్తున్నామని, మిల్లుకు రవాణా, హమాలీ చార్జీలు రైతుల ఖాతాలకు జమ చేస్తున్నామని చెప్పారు.

Updated Date - Nov 30 , 2024 | 01:10 AM