జల వనరుల శాఖకు రూ.44.05 కోట్లు నష్టం
ABN , Publish Date - Sep 12 , 2024 | 01:14 AM
తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీవర్షాలకు ఉమ్మడి జిల్లాలో జల వనరుల శాఖకు చెందిన పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులు, చెరువులకు రూ.44.05 కోట్లు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు.
అత్యవసర పనులకు రూ.3.12 కోట్లు అవసరం
అధికారుల ప్రతిపాదనలు
విశాఖపట్నం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి):
తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీవర్షాలకు ఉమ్మడి జిల్లాలో జల వనరుల శాఖకు చెందిన పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులు, చెరువులకు రూ.44.05 కోట్లు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. గండ్లు పూడ్చడం, ఇతరత్రా మరమ్మతులు మొత్తం 136 పనులు చేపట్టాలని గుర్తించారు. ఇందులో అత్యవసరమైనవి చేపట్టేందుకు రూ.3.12 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఇంకా శాశ్వత ప్రాతిపదికగా పనులు చేపట్టడానికి మరో రూ.40.92 కోట్లు అవసరమని ప్రతిపాదనల్లో పొందుపరిచారు.
విశాఖ జిల్లాలో చిన్న నీటి పారుదల విభాగంలో 18 పనులకు సంబంధించి రూ.3.96 కోట్ల నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న పనుల మరమ్మతులకు తాత్కాలికంగా రూ.25.55 లక్షలు, శాశ్వత పనులకు రూ.3.71 కోట్లు అవసరమని అంచనా వేశారు. భారీ నీటి పారుదల విభాగంలో రూ.2.02 కోట్ల నష్టం వాటిల్లగా తాత్కాలిక మరమ్మతులకు రూ.2.5 లక్షలు, శాశ్వత పనులు కింద రూ.2 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. అనకాపల్లి జిల్లాలో మైనర్ ఇరిగేషన్ విభాగంలో నర్సీపట్నం డివిజన్ పరిధిలో రూ.26.04 కోట్లు, చోడవరం వాటర్‌షెడ్ డివిజన్‌లో రూ.9.37 కోట్లు నష్టం వాటిల్లింది. నర్సీపట్నం డివిజన్‌లో అత్యవసర పనులకు రూ.2.14 కోట్లు, శాశ్వత పనులకు రూ.23.9 కోట్లు..మొత్తం రూ.26.04 కోట్లు, చోడవరం డివిజన్‌లో అత్యవసర పనులకు రూ.0.40 కోట్లు, శాశ్వత పనులకు రూ.8.97 కోట్లు వెరసి రూ.9.37 కోట్లు కావాలని ప్రతిపాదించారు. మేజర్ ఇరిగేషన్ కింద తాండవ ప్రాజెక్టుకు అత్యవసరంగా రూ.1.8 లక్షలు, శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు రూ.1.08 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అలాగే మధ్య తరహా నీటి పారుదల విభాగం పరిధిలో చోడవరం ప్రాంతంలోని రైవాడ, కోనాం, పెద్దేరు రిజర్వాయర్లకు అత్యవసర పనులకు రూ.28.6 లక్షలు, శాశ్వత ప్రాతిపదికగా పనులు చేపట్టేందుకు రూ.1.24 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదించారు.
జిల్లాలో రూ.867.5 లక్షల నష్టం
వర్షాలకు విశాఖ జిల్లాలో పలు శాఖలకు రూ.867.5 లక్షల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. అత్యధికంగా ఇరిగేషన్ శాఖకు రూ.401.55 లక్షలు, వ్యవసాయ శాఖకు సంబంధించి పంటలు దెబ్బతినడంతో రూ.9.54 లక్షలు, ఉద్యానవన పంటలకు రూ.7.82 లక్షలు, పశు సంవర్ధక శాఖ పరిధిలో ఐదు పశువులు మృతి చెందడంతో రూ.1.32 లక్షలు, మత్స్యశాఖ పరిధిలో బోట్లు, వలలు ఇతర పరికరాలు దెబ్బతినగా రూ.24.36 లక్షల నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. జల వనరుల శాఖలో రూ.401.55 లక్షలు నష్టం వాటిల్లింది. అలాగే పలు శాఖల పరిధిలో భవనాలు, ఇతరత్రా పనులకు సంబంధించి రూ.292.91 లక్షలు నష్టం వాటిల్లింది. అత్యవసర పనులకు రూ.84.37 లక్షలు, శాశ్వత పనులకు రూ.188.54 లక్షలు అవసరమవుతాయి. దెబ్బతిన్న బ్రిడ్జి మరమ్మతులకు రూ.0.60 లక్షలు, సామాజిక భవనాల మరమ్మతులకు రూ.137.4 లక్షలు, ఈపీడీసీఎల్ విభాగంలో రూ.2.18 లక్షలు, ఇళ్లు దెబ్బతినడంతో రూ.1.28 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. కాగా భారీవర్షాల కారణంగా పునరావాస శిబిరాలు, ఆహారం, మందులకు 76 వేల రూపాయలు వెచ్చించారు.