Share News

వీళ్లు పోరు!, వాళ్లు రారు!!

ABN , Publish Date - Sep 12 , 2024 | 01:19 AM

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)లో కొద్దిరోజుల కిందట జరిగిన బదిలీలపై అయోమయం నెలకొంది. జీవీఎంసీ పరిధిలో ఎనిమిది జోన్లు ఉండగా ఆరు జోన్‌లకు కమిషనర్‌లుగా పనిచేస్తున్న వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసి, వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తూ గత నెల 30న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

వీళ్లు పోరు!, వాళ్లు రారు!!

జీవీఎంసీలో జోనల్‌ కమిషనర్ల బదిలీపై అయోమయం

గత నెల 30న బదిలీ అయినా ఇప్పటివరకూ రిలీవ్‌ కాని వైనం

ఇంకా రిపోర్టు చేయని కొత్త జెడ్సీలు

బదిలీ ఉత్తర్వులు సవరించే అవకాశం ఉందని ప్రచారం

విశాఖపట్నం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి):

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)లో కొద్దిరోజుల కిందట జరిగిన బదిలీలపై అయోమయం నెలకొంది. జీవీఎంసీ పరిధిలో ఎనిమిది జోన్లు ఉండగా ఆరు జోన్‌లకు కమిషనర్‌లుగా పనిచేస్తున్న వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసి, వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తూ గత నెల 30న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే జోనల్‌ కమిషనర్లుగా నియమితులైన వారెవరూ ఇంతవరకూ జీవీఎంసీలో రిపోర్టు చేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొత్తగా జోనల్‌ కమిషనర్లుగా నియమితులైన వారి పట్ల ఆయా జోన్‌ల పరిధిలోని ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతోనే ఇంకా విధుల్లో చేరలేదనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు బదిలీ అయిన ఆరుగురిలో ఒకరు మినహా మిగిలిన ఐదుగురు ఇంకా రిలీవ్‌ కాకుండా కొనసాగుతుండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జోన్‌-1 కమిషనర్‌గా పనిచేస్తున్న కె.కనకమహాలక్ష్మిని సీఆర్‌డీఏ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ, ఆమె స్థానంలో సాలూరు మునిసిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న పి.ప్రేమప్రసన్నవాణిని నియమించారు. అలాగే జోన్‌-2 కమిషనర్‌గా పనిచేస్తున్న జి.శైలజావల్లిని రాజమండ్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కార్యదర్శిగా బదిలీ చేస్తూ...ఆమె స్థానంలో పోస్టింగ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్న పి.సింహాచలాన్ని నియమించారు. జోన్‌-3 కమిషనర్‌గా పనిచేస్తున్న విజయలక్ష్మిని ఆమె మాతృసంస్థకు సరండర్‌ చేస్తూ ఆమె స్థానంలో శివప్రసాద్‌ను నియమించారు. జోన్‌-4 కమిషనర్‌గా పనిచేస్తున్న పీవీడీ ప్రసాదరావును శ్రీకాకుళం మునిసిపల్‌ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ఆయన స్థానంలో పోస్టింగ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్న ఎం.మల్లయ్యనాయుడును నియమించారు. ప్రసాదరావు విధుల నుంచి రిలీవ్‌ అయి శ్రీకాకుళం మునిసిపల్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కానీ ఆయన స్థానంలో పోస్టింగ్‌ దక్కించుకున్న మల్లయ్యనాయుడు మాత్రం బాధ్యతలు స్వీకరించలేదు. జోన్‌-5 కమిషనర్‌గా పనిచేస్తున్న పి.కృష్ణను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో రామును నియమించారు. జోన్‌-6 కమిషనర్‌గా పనిచేస్తున్న బి.సన్యాసినాయుడును ఆయన మాతృసంస్థకు సరండర్‌ చేస్తూ, ఆయన స్థానంలో రేపల్లె కమిషనర్‌గా పనిచేస్తున్న బీఆర్‌ఎస్‌ శేషాద్రిని నియమించారు. బదిలీ ఉత్తర్వులు జారీ చేసి 15 రోజులు కావస్తున్నా ఇంతవరకూ పాతవారు విధుల నుంచి రిలీవ్‌ కాలేదు. కొత్తవారు విధుల్లో చేరలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులను సవరించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Updated Date - Sep 12 , 2024 | 01:19 AM