బాలికల సంరక్షణకు పటిష్ట చర్యలు
ABN , Publish Date - Nov 29 , 2024 | 10:48 PM
బాలికల సంరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు ఎం.వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. ఏజెన్సీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఇక్కడికి వచ్చిన ఆయన తొలుత స్థానిక బాల సదనాన్ని సందర్శించారు
వన్‌స్టాప్ సెంటర్ సిబ్బందికి శిక్షణ
బాల సదనానికి నూతన భవనం
మహిళా, శిశు సంక్షేమ శాఖ
సంచాలకులు ఎం.వేణుగోపాల్‌రెడ్డి
పాడేరు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): బాలికల సంరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు ఎం.వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. ఏజెన్సీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఇక్కడికి వచ్చిన ఆయన తొలుత స్థానిక బాల సదనాన్ని సందర్శించారు. జిల్లా బాల సంరక్షణ కేంద్రం, శిశు గృహ, వన్‌స్టాప్ సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. వన్‌స్టాప్ సెంటర్ సిబ్బందికి లీగల్ కౌన్సెలింగ్, మెడికల్ సపోర్టు, బాలికా సంరక్షణపై శిక్షణ అందిస్తామన్నారు. అలాగే సదనంలోని బాలల డార్మెంటరీని పరిశీలించి, శిశు గృహ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తే భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. బాల సదనంలో విద్యా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలికలకు దుస్తులు పంపిణీ చేశారు. ఆదివాసీ మహిళా హక్కుల పరిరక్షణ సమితి ప్రతినిధులు రాజమండ్రిలో ఓ కళాశాల ప్రిన్సిపాల్ మనోహర్ నుంచి సేకరించిన లక్ష రూపాయల పోస్టాఫీస్‌లో డిపాజిట్ చేసిన పత్రాలను బాల సదనంలో ఉన్న హుకుంపేట మండలం దొంతురాయి గ్రామానికి చెందిన కాకరి మోక్షతకు అందజేశారు. అనంతరం కిచెన్ గార్డెన్‌లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో వి.అభిషేక్, ఐసీడీఎస్ ఆర్‌జేడీ జి.చిన్మయిదేవి, ఐసీడీఎస్ పీడీ ఎన్.సూర్యలక్ష్మి, సీడీపీవో ఝాన్సీలక్ష్మీ, ఆదివాసీ మహిళా హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఎస్.గంగరాజు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షురాలు రాధ, కమిటీ సభ్యులు, బాలసదనం, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.