Share News

స్టీల్‌ప్లాంటు కేవీ క్లోజ్‌?

ABN , Publish Date - Feb 13 , 2024 | 01:24 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు విక్రయ ప్రక్రియ ప్రారంభం కాలేదంటూనే కేంద్ర ప్రభుత్వం మరోవైపు అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ పోతోంది.

స్టీల్‌ప్లాంటు కేవీ క్లోజ్‌?

కేంద్రీయ విద్యాలయం క్రమంగా మూసివేతకు ఏర్పాట్లు

ఈ ఏడాది ఒకటి, ప్లస్‌ 1 తరగతుల్లో అడ్మిషన్లు నిలిపివేత

కొత్త అడ్మిషన్లు వద్దని సీఎండీ, మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు

సిబ్బంది నియామకంలోను తాత్సారం

39లో సగం ఖాళీ

విద్యార్థుల చదువులపై ప్రభావం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు విక్రయ ప్రక్రియ ప్రారంభం కాలేదంటూనే కేంద్ర ప్రభుత్వం మరోవైపు అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ పోతోంది. మొన్నటికి మొన్న నిర్వహణ భారం, నిధుల లేమి పేరుతో బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3ని జిందాల్‌ కంపెనీకి కట్టబెట్టింది. ఇటీవలె స్టీల్‌ప్లాంటు జనరల్‌ ఆస్పత్రిని కూడా ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా కాంట్రాక్టు సిబ్బందిని ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి నిలిపివేసింది. ఇప్పుడు కేంద్రీయ విద్యాలయంపై దృష్టి పెట్టింది. ఈ ఏడాది 1, 11 తరగతుల్లో ప్రవేశాలు ఇవ్వొద్దని సీఎండీ ప్రిన్సిపాల్‌కు లేఖ రాశారు. అలాగే ఉక్కు మంత్రిత్వ శాఖ కూడా ఆదేశాలు జారీచేసింది.

స్టీల్‌ ప్లాంటు ఉద్యోగులు, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది పిల్లల కోసం ఇక్కడ 70 ఎకరాల్లో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు క్లాసులు ఉన్నాయి. ఇవి కాకుండా సంగీతం, యోగా, స్పోర్ట్స్‌, తదితరాలు నేర్పిస్తారు. కొన్నేళ్ల క్రితం కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ నిబంధనలు మార్చడంతో రిజర్వేషన్ల ఆధారంగా అందరికీ అవకాశం కల్పిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ, పారా మిలటరీలో పనిచేసే వారి పిల్లల కోసం దీనిని ఏర్పాటు చేశారు. ఒకటి నుంచి 12వ తరగతి వరకు 1,080 మందిని చేర్చుకోవడానికి అవకాశం ఉండగా ప్రస్తుతం 1,057 మంది ఉన్నారు. మొత్తం 27 సెక్షన్లు నిర్వహిస్తున్నారు.

సగం పోస్టులు ఖాళీ

స్టీల్‌ప్లాంటును ప్రైవేటుకు అప్పగించాలని చాలాకాలం క్రితమే నిర్ణయించడం వల్ల అందుకు అనుగుణంగా కేంద్రీయ విద్యాలయాన్ని కూడా మూసేయడానికి చాప కింద నీరులా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తం 39 మంది టీచింగ్‌ పోస్టులు ఉండగా...అందులో 19 ఖాళీగా ఉన్నాయి. అంటే సగం మందితోనే నడుపుతున్నారు. పోస్టుగ్రాడ్యుయేట్‌ టీచర్లు తొమ్మిది మందికి ఐదుగురే ఉన్నారు. హిందీ పండిట్‌, ఎకనామిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, కెమిస్ట్రీ టీచర్లు లేరు. ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ పోస్టులు 18 ఉండగా...సగం మందే ఉన్నారు. ఇంగ్లీష్‌, సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌-2, మేథమెటిక్స్‌-2, హిందీ, సంస్కృతం-1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవికాకుండా ఇతర అంశాలు బోధించడానికి ఆరుగురు (సంగీతం, క్రాఫ్ట్స్‌, నర్సింగ్‌, యోగా, స్పోర్ట్స్‌, డీఈఓ) ఉండాలి. వీరిలో ఒక్కరు కూడా లేరు.

1, 11 తరగతుల్లో అడ్మిషన్లు లేవు

ఇక్కడి కేంద్రీయ విద్యాలయాన్ని దశల వారీగా మూసేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లలో ఒకటి, 11 తరగతులు తీసేశారు. ఈ క్లాసుల్లో ఎవరికీ ప్రవేశాలు ఇవ్వడం లేదు. ఇప్పుడు ప్లస్‌ 2 చదువుతున్న వారు 2025లో బయటకు వెళ్లిపోతారు. ఈ ఏడాది ప్లస్‌ 1లో ఎవరికీ అడ్మిషన్లు ఇవ్వడంలేదు. కాబట్టి 2025-26లో ప్లస్‌ 1, ప్లస్‌ 2 ఉండవు. అలాగే ఇప్పుడు ఒక్కో సెక్షన్‌లో 50 మంది ఉండగా...రెండు సెక్షన్లు కలిపి 100 మందితో ఒకటే సెక్షన్‌ ఏర్పాటు చేస్తున్నారు. తగినంత మంది బోధన సిబ్బంది లేకపోవడంతో ఈ విధంగా సర్దుబాటు చేస్తున్నారు.

విద్యార్థుల చదువుపై ప్రభావం

కేంద్ర ప్రభుత్వం తెర వెనుక ప్రయత్నాలతో టీచర్లను లేకుండా చేసి సెక్షన్‌లో విద్యార్థులను పెంచేసి నాణ్యమైన విద్య దక్కకుండా చేస్తోంది. దీంతో ఉన్నతోద్యోగుల పిల్లలకు సరైన విద్య అందడం లేదు. ఇక్కడైతే అన్నీ బాగుంటాయని బయట వారు చేర్పించారు. ఇప్పుడు వారి భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా మారుతోంది.

Updated Date - Feb 13 , 2024 | 01:24 AM