Share News

కష్టాల్లో ఉక్కు

ABN , Publish Date - Sep 12 , 2024 | 01:18 AM

విశాఖ ఉక్కు ఉద్యోగులకు యాజమాన్యం బుధవారం మరో షాక్‌ ఇచ్చింది. ముడి పదార్థాల కొరత కారణంగా ముఖ్యంగా కోకింగ్‌ కోల్‌ లేనందు వల్ల బ్లాస్ట్‌ ఫర్నేస్‌ (బీఎఫ్‌)-3ను గురువారం నుంచి మూసివేస్తున్నట్టు ప్రకటించింది.

కష్టాల్లో ఉక్కు

తీవ్రమైన ముడి పదార్థాల కొరత

నేటి నుంచి బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 మూసివేత

ఇకపై ఒక్క బ్లాస్ట్‌ ఫర్నేస్‌తోనే ఉత్పత్తి

నెలకు ఆదాయం రూ.వెయ్యి కోట్లకు మించని పరిస్థితి

ప్లాంటు నిర్వహణ, ఉద్యోగులకు జీతాలు ఎలా ఇస్తారో...

విశాఖపట్నం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి):

విశాఖ ఉక్కు ఉద్యోగులకు యాజమాన్యం బుధవారం మరో షాక్‌ ఇచ్చింది. ముడి పదార్థాల కొరత కారణంగా ముఖ్యంగా కోకింగ్‌ కోల్‌ లేనందు వల్ల బ్లాస్ట్‌ ఫర్నేస్‌ (బీఎఫ్‌)-3ను గురువారం నుంచి మూసివేస్తున్నట్టు ప్రకటించింది.

ప్లాంటులో మొత్తం మూడు బ్లాస్ట్‌ ఫర్నేస్‌ (బీఎఫ్‌)లు ఉండగా ముడి పదార్థాలు అందుబాటులో లేకపోవడంతో బీఎఫ్‌-1ని కొద్దికాలంగా నడపడం లేదు. బీఎఫ్‌-2, బీఎఫ్‌-3లను అరకొరగా నడుపుతూ వచ్చారు. రెండింటి ద్వారా రోజుకు 14 వేల టన్నులకు పైగా హాట్‌ మెటల్‌ ఉత్పత్తి చేయాల్సి ఉండగా...పది వేల టన్నులు తీయడమే గగనంగా మారింది. ముఖ్యంగా విదేశాల నుంచి నౌకల ద్వారా తెప్పించుకున్న బొగ్గు గంగవరం, విశాఖపట్నం పోర్టుల్లో ఇరుక్కుపోయింది. షిప్పింగ్‌ ఏజెంట్లకు రవాణా చార్జీలు చెల్లించకపోవడంతో వారు కోర్టు అటాచ్‌మెంట్లు తెచ్చారు. దాంతో పోర్టుల నుంచి బొగ్గు ప్లాంటుకు చేరడం లేదు. కొంతమేర ప్రయత్నాలు చేసినప్పటికీ రెండు బీఎఫ్‌లను పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు సరిపడా బొగ్గు లేదు. బొగ్గుతో కోక్‌ను తయారుచేసే ఓవెన్‌ బ్యాటరీలను అరకొరగా నడిపితే వాటిలో సాంకేతిక లోపాలు తలెత్తి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండడంతో యాజమాన్యం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. కోక్‌ ఓవెన్‌ బ్యాటరీలకు నష్టం జరిగితే వాటి మరమ్మతులు చేయడానికి వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. అలాంటిదేమైనా జరిగితే మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు అవుతుందని ఓవెన్‌ బ్యాటరీలు షట్‌డౌన్‌ చేసి, బీఎఫ్‌-3ను తాత్కాలికంగా మూసేయాలని నిర్ణయించారు. అంటే కేవలం ఒకే ఒక్క బీఎఫ్‌ను నడపనున్నారు. దీనిని కూడా పూర్తిస్థాయిలో నడిపితే రోజుకు ఏడు వేల టన్నులకు మించి ఉత్పత్తి రాదు. నెలకు రెండు లక్షల టన్నులు మాత్రమే వస్తుంది. నెలకు రూ.2,500 కోట్ల ఉక్కు అమ్మకాలు జరిపితేనే అన్ని ఖర్చులు పోను ఉద్యోగులకు జీతాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కేవలం రెండు బీఎఫ్‌లను అరకొరగా నడుపుతుండడం వల్ల ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక, ముడి పదార్థాల కొనుగోళ్లకు డబ్బులు లేక ప్లాంటు ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఇప్పుడు నెలకు వచ్చే రెండు లక్షల టన్నులు ఉక్కును విక్రయిస్తే వేయి కోట్ల రూపాయల కంటే ఎక్కువ రావు. ఆ మొత్తంతో ప్లాంటును ఎలా నడుపుతారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ముడి పదార్థాల ఖర్చు కొంత తగ్గినా నిర్వహణ వ్యయాలన్నీ భరించాల్సిందే.

ఢిల్లీలో ఏం నిర్ణయించారో?

విశాఖ ఉక్కుకు ఎలా సాయం చేయాలనే అంశంపై ఢిల్లీలో ఉక్కు మంత్రిత్వ శాఖా మంత్రి, ఉన్నాతాధికారులు బుధవారం భేటీ అయ్యారు. సెయిల్‌లో విలీనం చేయడం ద్వారా అన్ని సమస్యలు అధిగమించవచ్చునని ఇక్కడి ఉద్యోగ వర్గాలు తెలియజేశాయి. అయితే దానిపై సానుకూల నిర్ణయం తీసుకోలేదని సమాచారం. కంటి తుడుపుగా ఎంతో కొంత మొత్తం ఇవ్వాలని, దాంతోనే ప్లాంటును ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పూర్తి వివరాలు గురువారానికి కానీ తెలియవని ఉద్యోగ వర్గాలు తెలిపాయి. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ఒత్తిడి చేస్తే తప్ప కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకోదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Updated Date - Sep 12 , 2024 | 01:18 AM