ఆర్‌అండ్‌బీ నిర్లక్ష్యం
ABN , Publish Date - Sep 16 , 2024 | 01:29 AM
రాష్ట్రంలో ప్రభుత్వం మారి మూడు నెలలు దాటినప్పటికీ కొన్ని ప్రభుత్వ శాఖల్లో పాత ప్రభుత్వ వాసనలు ఇంకా పోలేదు.
పునరుద్ధరణకు నోచుకోని తాచేరు డైవర్షన్ రోడ్డు
పది రోజుల క్రితం భారీ వర్షాలు, వరదలతో కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డు
నదిలో వరద తగ్గి ఐదు రోజులైనా పట్టించుకోని అధికారులు
ఆర్టీసీ బస్సులు దారి మళ్లింపు, రూట్ల కుదింపు
రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న మూడు జిల్లాల ప్రజలు
బుచ్చెయ్యపేట, సెప్టెంబరు 15:
రాష్ట్రంలో ప్రభుత్వం మారి మూడు నెలలు దాటినప్పటికీ కొన్ని ప్రభుత్వ శాఖల్లో పాత ప్రభుత్వ వాసనలు ఇంకా పోలేదు. ప్రజా సమస్యలపై గత వైసీపీ ప్రభుత్వంలో మాదిరిగానే నిర్లిప్తత, తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇందుకు బీఎన్ రోడ్డులో బుచ్చెయ్యపేట మండలం తాచేరుపై డైవర్షన్ రోడ్డు ఒక ఉదాహరణ. తాచేరు వరద ఉధృతికి డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయి ఎనిమిది రోజులు అవుతున్నప్పటికీ ఆర్‌అండ్‌బీ అధికారులు ఇంతవరకు పునరుద్ధరణ చర్యలు చేపట్టలేదు.
భీమునిపట్నం-నర్సీపట్నం (బీఎన్) రోడ్డులో బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట వద్ద తాచేరు నదిపై బ్రిటీష్ హయాంలో నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరడంతో గత ఏడాది అక్టోబరు నెలలో కూలిపోయింది. వాస్తవంగా చోడవరం మండలం వెంకన్నపాలెం నుంచి రోలుగుంట మండలం సరిహద్దు వరకు బీఎన్ రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనుల్లో భాగంగా ఇక్కడ కొత్త వంతెన నిర్మించాల్సి వుంది. వివిధ కారణాల వల్ల రోడ్డు అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. తాచేరుపై కొత్త నిర్మాణం చేపట్టకముందే పాత వంతెన కూలిపోవడంతో అధికారులు తాత్కాలికంగా సిమెంట్ తూములు వేసి డైవర్షన్ రోడ్డు నిర్మించారు. అప్పటి నుంచి ఈ రోడ్డు మీదుగానే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తాచేరు నదిలో వరద ఉధృతి పెరగడంతో 8వ తేదీన విజయరామరాజుపేట వద్ద తాత్కాలిక డైవర్షన్ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయి, తూములు బయటపడ్డాయి. మూడు జిల్లాలకు (విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు) ప్రధాన మార్గం కావడంతో వాహనాల రాకపోకలు అస్తవ్యస్తంగా మారాయి. ముఖ్యంగా ఆర్టీసీ అధికారులు మాడుగుల, పాడేరు, చోడవరం, తదితర ప్రాంతాలకు బస్సు సర్వీసులను రోజుల తరబడి రద్దు చేయడంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు. విశాఖ, అనకాపల్లి, చోడవరం వైపు నుంచి మాడుగుల, పాడేరు వైపు, చోడవరం నుంచి నర్సీపట్నం, రావికమతం, రోటుగుంటవైపు వెళ్లేవారితోపాటు బుచ్చెయ్యపేట మండలంలో విజయరామరాజుపేట, కుముందాంపేట, మంగళాపురం, చీడికాడ మండలానికి చెందిన పది గ్రామాల ప్రజలకు రవాణా పరంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి, రెండు కిలోమీటర్ల దూరంలో వున్న వడ్డాది కూడలికి చేరుకోవాలంటే గౌరీపట్నం, కస్పా రోడ్డు మీదుగా 13 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తున్నది. తాచేరు నదిని నడుచుకుంటూ దాటడానికి కూడా వీలుకాని పరిస్థితి నెలకొంది. నదిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టి ఐదు రోజులైయినా ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్ అధికారులు డైవర్షన్ రోడ్డు పునరుద్ధరణ పనులపై దృష్టి సారించలేదు.
ఆర్టీసీ బస్సులు దారి మళ్లింపు, కుదింపు
విజయరామరాజుపేట వద్ద తాచేరు నదిపై డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోవడంతో ఆర్టీసీ అధికారులు కొన్ని సర్వీసులను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడుపుతుండగా, మరికొన్నింటి దూరాన్ని కుదించారు. నర్సీపట్నం- చోడవరం మధ్య నడిచే బస్సులను వడ్డాది వరకే నడుపుతున్నారు. ప్రయాణికులు ఇక్కడి నుంచి ఆటోల్లో చోడవరం, ఆపైన ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్నది. అదే విధంగా చోడవరం వైపు నుంచి నర్సీపట్నం వెళ్లే వారు కూడా ఆటోల్లో వడ్డారి చేరుకుని ఇక్కడి నుంచి బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఆటోలు సైతం చోడవరం నుంచి గౌరీపట్నం మీదుగా వడ్డాది చేరుకోవాల్సి రావడంతో ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక అనకాపల్లి-మాడుగుల, కింతలి-అనకాపల్లి, పాడేరు-విశాఖపట్నం బస్సులు సింగ్‌ల్ రోడ్డు అయిన విజయరామరాజుపేట, అప్పలరాజుపురం, వంటర్లపాలెం, కె.జె.పురం మీదుగా మాడుగులకు చేరుకుంటున్నాయి. మరికొన్ని బస్సులు అప్పలరాజుపురం, బొయిపాడు మీదుగా చోడవరం చేరుకుంటున్నాయి. పాడేరు- విశాఖ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులను ఆర్టీసీ అధికారులు తగ్గించారు. వడ్డాది జంక్షన్ మీద నుంచి కాకుండా కే.జె.పురం మీదుగా ప్రయాణిస్తుండడంతో రానుపోను 25 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తున్నది. డ్రైవర్షన్ రోడ్డు పునరుద్ధరణ పనులను సత్వరమే చేపట్టి, తమ ఇబ్బందులు తొలగించాలని మూడు జిల్లాలకు చెందిన ప్రయాణికులు కోరుతున్నారు.
కాగా తాచేరు నదిలో వరద ప్రవాహం తగ్గినప్పటికీ డైవర్షన్ రోడ్డు పునరుద్ధరణ పనులు చేపట్టకపోవడంపై ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్ విభాగం ఏఈ సత్యప్రసాద్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, పనులు చేపట్టడానికి సామగ్రి సిద్ధంగా వుందని, రెండు మూడు రోజుల్లో పనులు మొదలు పెడతామని చెప్పారు.