గిరి విద్యార్థుల భవితకు బాట ‘మార్గదర్శిని’
ABN , Publish Date - Nov 29 , 2024 | 11:17 PM
గిరిజన విద్యార్థుల భవిష్యత్తును మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ‘మార్గదర్శిని’ కార్యక్రమాన్ని అన్ని విద్యాలయాల్లో విజయవంతంగా అమలు చేయాలని ఐటీడీఏ పీవో వి.అభిషేక్ అన్నారు.
శిక్షణ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో అభిషేక్
కెరీర్ గైడెన్స్‌పై విద్యార్థులకు
మరింత అవగాహన కల్పించాలని సూచన
పాడేరు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): గిరిజన విద్యార్థుల భవిష్యత్తును మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ‘మార్గదర్శిని’ కార్యక్రమాన్ని అన్ని విద్యాలయాల్లో విజయవంతంగా అమలు చేయాలని ఐటీడీఏ పీవో వి.అభిషేక్ అన్నారు. స్థానిక కాఫీహౌస్‌లో ‘మార్గదర్శిని’ కార్యక్రమం అమలుపై శుక్రవారం ఏటీడబ్ల్యూవోలు, ఎంఈవోలు, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పదో తరగతి పూర్తయిన తర్వాతఇంటర్, డిగ్రీ, పీజీ చదువులతోపాటు ఉద్యోగావకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా వృత్తి విద్య, మార్గదర్శకం, అంచనా, సమాచారంపై ఐటీడీఏ పీవో క్షుణ్ణంగా వివరించారు. ముఖ్యంగా ఇంటర్మీడియెట్ తర్వాత ఏ కోర్సు చదివితే ఏవిధమైన ఉద్యోగావకాశాలు లభిస్తాయనేది విద్యార్థులకు సంపూర్ణంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ క్రమంలో గిరిజన విద్యార్థులు ఎలా చదవాలి? ఏం చదవాలి? అనేది పాఠశాలల్లో పక్కాగా వివరించాలన్నారు. వారి సామాజిక ఆలోచనా విధానంలో మార్పు రావాలని, ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నతస్థితికి ఎదగాలనే కాంక్షను వారిలో రగిలించాలన్నారు. కేవలం టెన్త్, ఇంటర్‌తో ఆగిపోకుండా ప్రతి గిరిజన విద్యార్థి డిగ్రీ వరకు చదువుకునేలా కృషి చేయాలన్నారు. అలాగే డిగ్రీ అనంతరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించే పోటీ పరీక్షలు, ఏపీపీఎస్‌సీ నిర్వహించే పరీక్షల గురించి ఐటీడీఏ పీవో అభిషేక్ వివరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు, గిరిజన సంక్షేమ విద్యాశాఖ డీడీ ఎల్.రజనీ, మాస్టర్ ట్రైనర్లు, 11 మండలాల ఏటీడబ్ల్యూవోలు, ఎంఈవోలు, 117 ఆశ్రమ పాఠశాలు, 17 ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎంలు, గురుకుల కళాశాల ప్రిన్సిపాళ్లు, 11 కేజీబీవీల టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.