ఆడుదాం ఆంధ్రలో అదే రచ్చ
ABN , Publish Date - Feb 13 , 2024 | 01:17 AM
‘ఆడుదాం...ఆంధ్ర’ క్రీడా పోటీల్లో సోమవారం కూడా గొడవ జరిగింది.
అనకాపల్లి కబడ్జీ జట్టును డిస్ క్వాలిఫై చేస్తున్నట్టు ప్రకటించిన అధికారులు
విశాఖ-కర్నూలు జట్ల మధ్య నిర్వహించ తలపెట్టిన మ్యాచ్‌ను అడ్డుకంటూ మైదానంలో అనకాపల్లి ఆటగాళ్ల నిరసన
మ్యాచ్ ఆడించేందుకు అంగీకరించడంతో ఆందోళన విరమణ
విశాఖపట్నం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి):
‘ఆడుదాం...ఆంధ్ర’ క్రీడా పోటీల్లో సోమవారం కూడా గొడవ జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో ఆదివారం అనకాపల్లి, విశాఖ జిల్లాల జట్ల మధ్య జరగాల్సిన కబడ్డీ మ్యాచ్ హైడ్రామా మధ్య వాయిదా పడిన విషయం తెలిసిందే. విశాఖ జిల్లా జట్టులో కొత్తగా చేరిన ఆటగాడిని అధికారులు గుర్తించి పక్కనపెట్టాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. సోమవారం ఉదయం ఇరు జట్ల మధ్య మ్యాచ్ నిర్వహిస్తామని చెప్పారు. కానీ, అనూహ్యంగా సోమవారం మధ్యాహ్నం వరకు మ్యాచ్ నిర్వహించకపోగా, అనకాపల్లి జట్టును డిస్ క్వాలిఫ్ చేస్తున్నట్టు ప్రకటించారు. విశాఖ జట్టుకు కర్నూలు జిల్లా జట్టుతో మ్యాచ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇరు జట్లు ఆడేందుకు గ్రౌండ్‌లో దిగే సమయంలో అనకాపల్లి జట్టు సభ్యులు మైదానంలో కూర్చుని నిరసన తెలిపారు. తమకు న్యాయం చేసేంత వరకు గ్రౌండ్ వదిలి వెళ్లబోమని స్పష్టంచేశారు. ‘ఉయ్ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు. సుమారు గంటపాటు మైదానంలోనే కూర్చోవడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. సమస్యను పెద్దది చేయకుండా అనకాపల్లి జట్టును మ్యాచ్ ఆడించాలంటూ ఆదేశాలు రావడంతో శాప్ అధికారులు, ఇక్కడ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న విజయనగరం జిల్లా డీఎస్‌డీవో అనకాపల్లి, విశాఖ జట్ల మధ్య మ్యాచ్ నిర్వహిస్తున్నామంటూ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని విశాఖ జట్టు ఆటగాళ్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అర్హత లేదని ప్రకటించిన జట్టుతో ఎలా ఆడతామని ఆందోళన నిర్వహించారు. వారితో శాప్, క్రీడా శాఖకు చెందిన అధికారులు మాట్లాడి సమస్యను పరిష్కరించడంతో సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎట్టకేలకు విశాఖ, అనకాపల్లి జట్ల మధ్య నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో విశాఖ జిల్లా జట్టు విజయం సాధించింది. ఆట సమయంలో అనకాపల్లి జట్టు కెప్టెన్‌కు గాయం కావడంతో కొంతసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది.