Share News

ఎస్సీ వర్గీకరణకు అనుకూల తీర్పును పునఃసమీక్షించాలి

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:34 AM

ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు డిమాండ్‌ చేశారు.

ఎస్సీ వర్గీకరణకు అనుకూల తీర్పును పునఃసమీక్షించాలి
తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న దళిత నాయకులు

దళిత నాయకుల డిమాండ్‌

పాయకరావుపేట, సెప్టెంబరు 11 : ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం వర్గీకరణను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో దళిత నాయకులు చేపట్టిన ధర్నాకు సంఘీభావంగా పాయకరావుపేటలో సదరు నాయకులు ర్యాలీ, ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మెయిన్‌ రోడ్డులోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బైక్‌ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు పెదపాటి మేఘరంజన్‌ తదితరులు మాట్లాడుతూ పార్లమెంట్‌ ఆమోదం, ఆర్టికల్‌ 341 సవరణ, రాష్ట్రాల అభిప్రాయ సేకరణ చేయకుండా సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రివ్యూ పిటిషన్‌ వేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు ఇంజరపు సూరిబాబు, పల్లి దుర్గారావు, కువల కుమార్‌, తాటిపాక లోవరాజు, పల్లా ప్రసాద్‌, ఐఎన్‌ మూర్తి, ఏనుగుపల్లి అప్పారావు, గారా చంటి, రమేష్‌ తదతరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 12:35 AM