ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైతే ఉపేక్షించను
ABN , Publish Date - Nov 30 , 2024 | 10:46 PM
జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం జరిగితే ఉపేక్షించేదిలేదని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ హెచ్చరించారు.
మెయిన్‌రోడ్ల ఆక్రమణలపై వీఆర్‌వోలదే బాధ్యత
డిసెంబరు నెలాఖరుకు ల్యాండ్ ఆడిట్ పూర్తి చేయాలి
రెవెన్యూ చట్టాలపై 3, 4 తేదీల్లో శిక్షణ
చింతూరు, రంపచోడవరంల్లో ఇండస్ర్టీయల్ ఎస్టేట్లు
రంపచోడవరంలో ఇండోర్ స్టేడియం
జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్
పాడేరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం జరిగితే ఉపేక్షించేదిలేదని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ హెచ్చరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణపై జిల్లాలోని ఐటీడీఏ పీవోలు, సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో శనివారం నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఎక్కడైనా ప్రధాన రహదారులకు ఇరువైపుల ఆక్రమణలు జరిగితే గ్రామ రెవెన్యూ అధికారులదే బాధ్యతని, వారిపైనే చర్యలు తీసుకుంటానని స్పష్టంచేశారు. ఆర్‌అండ్‌బీ శాఖ భూములు, బంజరు భూములు, గ్రామకంఠం భూములు దురాక్రమణ జరగకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదేనన్నారు. పోరంబోకు స్థలాలు ఆక్రమణలు జరిగితే రెవెన్యూ అధికారులపై చర్యలు చేపడతామని కలెక్టర్ హెచ్ఛరించారు. అలాగే గ్రామాలవారీగా ప్రభుత్వ భూములను ఆడిట్ చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఆక్రమణలపై సమగ్రమైన సర్వే నిర్వహించి, వాటి సర్వే నంబర్లు పక్కాగా గుర్తించాలన్నారు. డిసెంబరు నెలాఖరుకు నాటికి ల్యాండ్ ఆడిట్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.
జిల్లా కేంద్రంలో ఆక్రమణలను తొలగించాలి
జిల్లా కేంద్రంలోని ఆక్రమణలను తొలగించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రధానంగా పాడేరు అంబేడ్కర్ సెంటర్ పరిసరాల్లో ఉన్న ఆక్రమణలు తొలగించి, చిరు వ్యాపారులను రైతు బజారుకు తరలించాలని ఆదేశించారు. ఇకపై ఆ ప్రదేశంలో ఆక్రమణలు జరిగితే సంబంధిత వీఆర్‌వోను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే వారపు సంతల్లో ప్రభుత్వ భూములను గుర్తించి షెడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఆయా షెడ్ల నిర్మాణానికి గ్రామసభ తీర్మానం చేయాలని, గ్రామసభలో గిరిజన వ్యాపారులను భాగస్వామ్యం చేయాలని, సంతలో వ్యాపారాలు చేస్తున్న గిరిజనులు, గిరిజనేతరులను గుర్తించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లలో ఇండస్ర్టీయల్ ఎస్టేట్ ఏర్పాటు చేయడానికి అనువైన భూములను గుర్తించి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. అలాగే రంపచోడవరం గురుకులం పాఠశాల సమీపంలో ఉన్న భూమిలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు. అలాగే డిసెంబరు 3, 4 తేదీల్లో జిల్లాలోని గ్రామ రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లకు రెవెన్యూ చట్టాలపై అవగాహన కల్పించేందుకు అవసరమైన శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్ గౌడ, పాడేరు, రంపచోడవరం సబ్‌కలెక్టర్లు శార్యమన్ పటేల్, కల్పశ్రీ, చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.