Share News

హార్బర్‌ ఏసీపీ మోసేజ్‌పాల్‌ సస్పెన్షన్‌

ABN , Publish Date - Oct 02 , 2024 | 01:04 AM

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో హార్బర్‌ ఏసీపీగా పనిచేస్తున్న మోసేజ్‌పాల్‌ను సస్పెండ్‌ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

హార్బర్‌ ఏసీపీ మోసేజ్‌పాల్‌ సస్పెన్షన్‌

డీజీపీ ఉత్తర్వులు

అవినీతి ఆరోపణలపై సీపీ విచారణ

వాస్తవమేనని తేలడంతో డీజీపీకి నివేదిక

విశాఖపట్నం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి):

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో హార్బర్‌ ఏసీపీగా పనిచేస్తున్న మోసేజ్‌పాల్‌ను సస్పెండ్‌ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. తన సబ్‌ డివిజన్‌ పరిధిలో స్టేషన్లకు వచ్చే ముఖ్యమైన కేసులను కొంతమంది కానిస్టేబుళ్ల ద్వారా తన వద్దకు తెప్పించుకుంటారని, సివిల్‌ కేసుల్లో తలదూర్చి సెటిల్‌మెంట్‌లు చేస్తుంటారని, చీటింగ్‌ కేసులకు సంబంధించి ఫిర్యాదులు వస్తే అవతలి వారిని పిలిచి బెదిరించి డబ్బులు గుంజుతుంటారని, పరిశ్రమల్లో ఏదైనా ప్రమాదం కారణంగా కార్మికులు మరణిస్తే సంబంధిత కాంట్రాక్టర్లు, కంపెనీల ప్రతినిధులను పిలిచి డబ్బులు వసూలు చేస్తుంటారనే ఆరోపణలు మోసేజ్‌పాల్‌పై ఉన్నాయి. తన దందాకు అడ్డుపడుతున్నారని కక్ష కట్టి మల్కాపురం సీఐగా పనిచేసిన సన్యాసినాయుడును వేధించారని పోలీస్‌ శాఖలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నుంచి తప్పిస్తానని చెప్పి ఒకరి వద్ద రూ.2.5 లక్షలు వసూలు చేశారని, కానీ పని జరగకపోవడంతో బాధితుడు నేరుగా సీపీ శంఖబ్రతబాగ్చిని కలిసి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీనిపై సీపీ ప్రత్యేకంగా విచారణ నిర్వహించగా వాస్తవమేనని తేలడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ ద్వారకా తిరుమలరావుకు నివేదిక పంపించారు. ఈ నేపథ్యంలో మోసేజ్‌పాల్‌ను సస్పెండ్‌ చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీచేశారు. కాగా మోసేజ్‌పాల్‌కు రెండు నెలల కిందటే బదిలీ అయినప్పటికీ ఇంకా రిలీవ్‌ కాలేదు. ఇదిలావుండగా మోసేజ్‌పాల్‌ సస్పెన్షన్‌ గురించి సీపీ శంఖబ్రతబాగ్చి వద్ద ప్రస్తావించగా అనేక అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపానన్నారు. విచారణలో ఆరోపణలన్నీ వాస్తవమేననితేలడంతో డీజీపీకి నివేదిక పంపించానన్నారు. పోలీస్‌ శాఖలో ఎవరు అవినీతికి పాల్పడినా ఉపేక్షించేది లేదన్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చేవారికి నిస్వార్థంగా, నిజాయితీగా సేవలు అందించాల్సిందేనని సీపీ స్పష్టంచేశారు.

Updated Date - Oct 02 , 2024 | 01:04 AM