Share News

వైసీపీ నేతల చేతివాటం

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:39 AM

జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్ల నిర్మాణాల మాటున వైసీపీ నేతలు సాగించిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం సరఫరా చేసిన సిమెంట్‌, ఇనుమును దారిమళ్లించారు. దర్జాగా అమ్ముకొని జేబులు నింపుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వైసీపీ నేతల చేతివాటం
అనకాపల్లి మండలం కుంచంగిలో ఆగిన ఇళ్ల నిర్మాణాలు

జగనన్న కాలనీల్లో సిమెంట్‌, ఇనుము మాయం

60 టన్నుల ఇనుము, 25 వేల బస్తాల సిమెంట్‌ తస్కరణ

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో

జనసైనికులు ఫిర్యాదు

విచారణకు ఆదేశించిన కలెక్టర్‌

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్ల నిర్మాణాల మాటున వైసీపీ నేతలు సాగించిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం సరఫరా చేసిన సిమెంట్‌, ఇనుమును దారిమళ్లించారు. దర్జాగా అమ్ముకొని జేబులు నింపుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వైసీపీ అధికారంలో వున్నప్పుడు పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో అనకాపల్లి మండలం సంపతిపురం, రొంగలివానిపాలెం, కూండ్రం, కుంచంగి, మామిడిపాలెం, వీజేపాలెం, పాపయ్యపాలెం, పిసినికాడ, సీతానగరం గ్రామాల్లో విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) ఆధ్వర్యంలో జగనన్న లేఅవుట్‌లు వేశారు. జీవీఎంసీ పరిధిలో పలు ప్రాంతాలకు చెందిన సుమారు 10,760 మందికి ఈ లేఅవుట్లలో స్థలాలు, పక్కా ఇళ్లు మంజూరు చేశారు. ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు వీఎంఆర్‌డీఏ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు టెండర్లు పిలిచారు. తక్కువ రేటుకు కోట్‌ చేసిన ఒక కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.8 లక్షలు కేటాయించింది. భవన నిర్మాణానికి ఈ నిధులు చాలవంటూ ఒక్కో లబ్ధిదారు అదనంగా రూ.50 వేలు చెల్లిస్తే కాంట్రాక్టర్‌ ఇళ్ల నిర్మాణ పనులు చేపడతారని అధికారులు చెప్పారు. ఈ మేరకు లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ప్రభుత్వం లబ్ధిదారుల పేరుతో కాంట్రాక్టర్‌కు సిమెంట్‌, ఇనుము, ఇసుక సరఫరా చేసింది. మొత్తం 4,558 గృహాలకుగాను ఇంతవరకు 886 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. 1,613 ఇళ్లు బేస్‌మెంట్‌ వరకు, 290 ఇళ్లు శ్లాబ్‌ వరకు, 980 ఇళ్లు లింటల్‌ స్థాయిలో ఉన్నాయి. 789 ఇళ్ల నిర్మాణ పనులు ఇంకా మొదలు కాలేదు. కాగా ప్రభుత్వం మారితే బిల్లులు వస్తాయో, లేదో అన్న అనుమానంతో ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్‌ ఎన్నికల సమయంలో పనులు ఆపేశారు. ఇళ్ల నిర్మాణ పనులకు ప్రభుత్వం సరఫరా చేసిన సిమెంటు, ఇనుముకు అధికారులు సరైన భద్రత కల్పించలేదు. ఇదే అదనుగా భావించిన కొంతమంది వైసీపీ నాయకులు సంపతిపురం, కూండ్రం, రొంగలివానిపాలెం గ్రామాల్లో జగనన్న కాలనీలకు సరఫరా అయిన సిమెంట్‌, ఇనుము మాయం చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఓడిపోవడంతో ఓట్ల లెక్కింపు జరిగిన రోజు రాత్రి పలువురు వైసీపీ నాయకులు జగనన్న కాలనీల్లో నిల్వ చేసిన సిమెంట్‌, ఐరన్‌ను ఎత్తుకుపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు 60 టన్నుల ఇనుము, 25 వేల పైచిలుకు సిమెంట్‌ బస్తాలు ఎత్తుకుపోయి అమ్ముకున్నట్టు తెలిసింది. ఇళ్ల లబ్ధిదారులంతా విశాఖ నగరానికి చెందిన వారు కావడం, స్థానికంగా వుండకపోవడం, ఎన్నికల సమయంలో కాంట్రాక్టర్‌ పనులు ఆపేయడంతో స్థానిక వైసీపీ నాయకులు చేతికి అందినకాడికి ఇనుము, సిమెంటు దోచుకుపోయారని సమాచారం. రొంగలివానిపాలేనికి చెందిన ఒక వైసీపీ నాయకుడి అండదండలతో సిమెంట్‌, ఇనుముతోపాటు తమ సొంత సొమ్ముతో కొనుగోలు చేసిన ఇసుక, కంకరను ఎత్తుకుపోయారని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు.

కలెక్టర్‌కు ఫిర్యాదు.. విచారణకు ఆదేశం

అనకాపల్లి మండలం సంపతిపురం, కూండ్రం, రొంగలివానిపాలెం జగనన్న కాలనీల్లో సిమెంట్‌, ఐరన్‌ మాయమవడంపై స్థానిక జనసేన నాయకులు సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన కలెక్టర్‌.. సిమెంట్‌, ఐరన్‌ మాయంపై విచారణ చేపట్టి అవసరమైతే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని గృహ నిర్మాణ సంస్థ పీడీ, వీఎంఆర్‌డీఏ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సదరు వైసీపీ నాయకులు భయాందోళన చెందుతున్నట్టు తెలిసింది.

Updated Date - Oct 02 , 2024 | 12:39 AM