Share News

నక్కపల్లిలోనే గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:42 AM

విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కోసం మండలంలో భూములిచ్చిన నిర్వాసిత రైతుల సమస్యలు తెలుసుకోవడానికి ఈ నెల 17వ తేదీ మంగళవారం నక్కపల్లిలోనే గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు డిమాండ్‌ చేశారు.

 నక్కపల్లిలోనే గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాలి
రైతులతో కలిపి విలేకర్లతో మాట్లాడుతున్న నాయకులు

కారిడార్‌ నిర్వాసిత రైతుల డిమాండ్‌

నక్కపల్లి, సెప్టెంబరు 15 : విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కోసం మండలంలో భూములిచ్చిన నిర్వాసిత రైతుల సమస్యలు తెలుసుకోవడానికి ఈ నెల 17వ తేదీ మంగళవారం నక్కపల్లిలోనే గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు డిమాండ్‌ చేశారు. చందనాడ సమీపంలో ఆదివారం సాయంత్రం కారిడార్‌ నిర్వాసిత రైతులతో కలిసి వారు విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 17న కారిడార్‌ నిర్వాసిత రైతుల సమస్యలు తెలుసుకోవడానికి హోం మంత్రి అనిత, కలెక్టర్‌తో అనకాపల్లిలో గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేస్తామని తొలుత చెప్పారన్నారు. కానీ హోం మంత్రి, కలెక్టర్‌కు బదులుగా ఆర్‌డీవో, ఎస్‌డీసీ స్థాయి అధికారులతో అనకాపల్లిలో గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం తగదని పేర్కొన్నారు. ఐదు రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్న ఎంతో మంది నిర్వాసిత రైతులకు ఇంకా పరిహారం, ప్యాకేజీ రాలేదని, గృహాలకు సంబంధించి పరిహారం కూడా ఇవ్వలేదని తెలిపారు. అటువంటప్పుడు రైతులంతా కలిసి అనకాపల్లి రావడం కష్టమవుతుందన్నారు. అందువల్ల ఎస్‌డీసీ, ఆర్‌డీవో, తహసీల్దార్లు, ఏపీఐఐసీ అధికారులతో నక్కపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలోనే గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో తమ కార్యాచరణ ప్రణాళికను తామే రూపొందించుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం ప్రతినిధులు గంటా తిరుపతిరావు, సూరకాసుల గోవింద్‌, వెలగా ఈశ్వరరావు, తళ్లా భార్గవ్‌, ఎం.రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:43 AM