Share News

అటవీ అధికారులు ఇష్టారాజ్యం

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:31 AM

అటవీ శాఖ అధికారులు ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కారు. అనకాపల్లి నియోజకవర్గం పరిధిలోని కశింకోట మండలం బయ్యవరం పంచాయతీలో ‘శారదా ఉద్యాన వనం’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు, ఎంపీ సీఎం రమేశ్‌లను ఆహ్వానించలేదు. అటవీ శాఖ విశాఖపట్నం సర్కిల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఎస్‌.శ్రీకంఠనాథరెడ్డి, జిల్లా అటవీశాఖాధికారి జగన్నాథ సింగ్‌తో కలిసి రిబ్బర్‌ కట్‌ చేశారు. కోటిన్నర రూపాయలతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించకపోవడంపై కూటమి నేతల్లో చర్చ జరుగుతున్నది.

అటవీ అధికారులు ఇష్టారాజ్యం
శారదా వనం టికెట్‌ కౌంటర్‌ను ప్రారంభిస్తున్న సీసీఎఫ్‌ శ్రీకంఠనాథరెడ్డి (ఫైలు ఫొటో)

‘శారదా వనం’ ప్రారంభానికి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలకు అందని ఆహ్వానాలు

ప్రజాప్రతినిధులు లేకుండానే రిబ్బన్‌ కట్‌ చేసిన అధికారులు

ప్రొటోకాల్‌కు తూట్లు

సీఎం, డిప్యూటీ సీఎంలకు ఫిర్యాదు చేసే యోచనలో జనసేన, బీజేపీ నాయకులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

అటవీ శాఖ అధికారులు ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కారు. అనకాపల్లి నియోజకవర్గం పరిధిలోని కశింకోట మండలం బయ్యవరం పంచాయతీలో ‘శారదా ఉద్యాన వనం’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు, ఎంపీ సీఎం రమేశ్‌లను ఆహ్వానించలేదు. అటవీ శాఖ విశాఖపట్నం సర్కిల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఎస్‌.శ్రీకంఠనాథరెడ్డి, జిల్లా అటవీశాఖాధికారి జగన్నాథ సింగ్‌తో కలిసి రిబ్బర్‌ కట్‌ చేశారు. కోటిన్నర రూపాయలతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించకపోవడంపై కూటమి నేతల్లో చర్చ జరుగుతున్నది.

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అటవీశాఖ ఆధ్వర్యంలో అనకాపల్లి నియోజకవర్గంలో 120 ఎకరాల్లో ‘శారదా వనం’ పేరుతో చెట్లపెంపకం కార్యక్రమాన్ని చేపట్టింది. తొలి దశ పనులకు మంజూరైన రూ.1.4 కోట్లతో శారదా వనం వద్ద ప్రవేశ ద్వారం, టికెట్‌ కౌంటర్‌ నిర్మించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆధ్వర్యంలో అటవీ శాఖ చేపడుతున్న ‘శారదా వనం’ తొలిదశ పనుల ప్రారంభోత్సవానికి అటవీ శాఖ మంత్రి అయిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను ఆహ్వానించలేదు. కనీసం స్థానిక ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణలకు కూడా సమాచారం ఇవ్వలేదు. అటవీ శాఖ విశాఖపట్నం సర్కిల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఎస్‌.శ్రీకంఠనాథరెడ్డి, జిల్లా అటవీశాఖాధికారి జగన్నాథ సింగ్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. అటవీశాఖ అధికారులు ప్రొటోకాల్‌ ఉల్లంఘించడాన్ని జనసేన, బీజేపీ నాయకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ప్రజాప్రతినిధులను ఆహ్వానించకపోవడం వారిని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ ఉన్నతాధికారి ఒకరు ఉద్దేశపూర్వకంగానే ఎంపీ, ఎమ్మెల్యేలను పక్కన పెట్టి, ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కిన వైనాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ల దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. కాగా ప్రొటోకాల్‌ పాటించకుండా శారదా వనాన్ని ప్రారంభించడంపై జిల్లా ఇన్‌ఛార్జి అటవీ శాఖాధికారి సునీల్‌కుమార్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, తమ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, వనంలో ఇంకా పూర్తిస్థాయిలో పనులు జరగలేదన్నారు.

Updated Date - Oct 02 , 2024 | 12:31 AM