Share News

నడి సంద్రంలో అగ్నికీలలు

ABN , Publish Date - Sep 16 , 2024 | 01:13 AM

చేపల వేటకు వెళ్లిన ఫిషింగ్‌ బోటుకు నడి సముద్రంలో అగ్ని ప్రమాదం సంభవించి మంటలు చుట్టుముట్టాయి.

నడి సంద్రంలో అగ్నికీలలు

మెకనైజ్డ్‌ బోటులో అగ్నిప్రమాదం

పూర్తిగా దగ్ధమైన బోటు

ప్రాణభయంతో సముద్రంలో దూకేసిన మత్స్యకారులు

మరో బోటులో తీరానికి చేరుకున్న బాధితులు

మహారాణిపేట, సెప్టెంబరు 15:

చేపల వేటకు వెళ్లిన ఫిషింగ్‌ బోటుకు నడి సముద్రంలో అగ్ని ప్రమాదం సంభవించి మంటలు చుట్టుముట్టాయి. అందులోని ఐదుగురు మత్స్యకారులు ప్రాణభయంతో నడి సముద్రంలోకి దూకి ఈదుతూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు...

మత్స్యకారులు వాసుపల్లి అప్పయ్యమ్మకు చెందిన ఐఎన్‌డీఏిపీవీ 5ఎంఎం 495 నంబరు గల మెకనైజ్డ్‌ బోటులో ఆదివారం ఐదుగురు మత్స్యకారులు హార్బర్‌ నుంచి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. సంద్రంలో చేపలు వేటాడుతుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో బోటు ఇంజన్లో ఒక్కసారిగా మంటలు రేగాయి. గాలుల ధాటికి అవి బోటునంతా వ్యాపించడంతో భయాందోళన చెందిన మత్స్యకారులు గురుమూర్తి, నరసింహం, రాము, సత్తయ్య, అప్పన్న సంద్రంలోకి దూకేశారు. అటుగా వస్తున్న మరో బోటు ప్రమాదాన్ని గుర్తించి, సముద్రంలో ఈదుకుంటూ ప్రాణాలు కాపాడుకోవాలని చూస్తున్న మత్స్యకారులను తమ బోటులో ఎక్కించుకుని సాయంత్రానికి క్షేమంగా ఫిషింగ్‌ హార్బర్‌కు చేర్చారు. సమాచారం అందుకున్న మత్స్యశాఖ ఇన్‌చార్జి జాయింట్‌ డైరెక్టర్‌ జి.విజయ హార్బర్‌కు చేరుకుని మత్స్యకా రుల యోగ క్షేమాలను తెలుసుకున్నారు. జరిగిన ప్రమాదం పై ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిని మెకానైజ్డ్‌ బోటు అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్ష్మణరావు, మాజీ చైర్మన్‌ కోలా గురువులు, చీకటి రమేష్‌ తదితరులు పరామర్శించారు

వివాహిత హత్య!

అనుమానంతో హతమార్చిన భర్త

నక్కవానిపాలెంలో దారుణం

కాకినాడ పోలీసుల ఎదుట లొంగుబాటు

ఎంవీపీ కాలనీ, సెప్టెంబరు 15:

అనుమానం పెను భూతమై ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కర్కశంగా కడతేర్చాడో భర్త. ఈ దారుణ సంఘటన ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు అందించిన వివరాల మేరకు...

ఉపాధి రీత్యా కాకినాడ నుంచి వలస వచ్చి నక్కవానిపాలెంలో నివాసం ఉంటున్న డానియేల్‌, అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు ప్రాంతానికి చెందిన చెల్లూరి సలోమీ (28) 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. సలోనీ నగరంలోని ఓ హోటల్‌లో సూపర్‌వైజరుగా పనిచేస్తుండగా, డానియేల్‌ ఎండాడ మిరకిల్‌ చర్చిలో పనిచేస్తున్నాడు. కాగా భార్య ప్రవర్తనపై ఇతడికి కొద్దికాలంగా డేనియల్‌కు అనుమానం ఉంది. దీంతో ఆమెను వేధిస్తుండేవాడు. కాగా ఆదివారం ఇంట్లో విగతజీవిగా పడిఉన్న సలోనిని చూసిన ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డేనియల్‌ ఆమె మెడకు చున్నీతో ఉరివేసి హత్య చేసి కొడుకుతో సహా కాకినాడ పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు సమాచారం. అతడిని ఇక్కడి పోలీసులు నగరానికి తీసుకువస్తున్నారు. ఆ తరువాత పూర్తి వివరాలు తెలుస్తాయని కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ మురళి వివరించారు.

Updated Date - Sep 16 , 2024 | 01:14 AM