పేలుతున్న బాణసంచా ధరలు
ABN , Publish Date - Oct 31 , 2024 | 01:10 AM
దీపావళి మందుగుండు సామగ్రి ధరలు పటాసుల్లా పేలుతున్నాయి. గత ఏడాదితో పోల్చితే 20 శాతం వరకు ధరలు పెరిగినట్టు ఇటు వ్యాపారులు, అటు కొనుగోలుదారులు చెబుతున్నారు. టపాసుల ధరలను చూసి సామాన్య, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
గత ఏడాదితో పోలిస్తే 20 శాతం మేర అధికం
టపాసుల దుకాణాల వద్ద అంతంతమాత్రంగానే సందడి
అనకాపల్లి టౌన్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): దీపావళి మందుగుండు సామగ్రి ధరలు పటాసుల్లా పేలుతున్నాయి. గత ఏడాదితో పోల్చితే 20 శాతం వరకు ధరలు పెరిగినట్టు ఇటు వ్యాపారులు, అటు కొనుగోలుదారులు చెబుతున్నారు. టపాసుల ధరలను చూసి సామాన్య, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కాకర పువ్వొత్తులు సాదా రకం రూ.150, కలర్స్ అయితే రూ.200, భూచక్రాలు సైజు, కంపెనీలను బట్టి ప్యాకెట్ రూ.50 నుంచి 150 పలుకుతున్నది. 100 వాలా టపాసులు రూ.30-50, విష్ణుచక్రాల బాక్సు రూ.200 నుంచి రూ.250కి విక్రయిస్తున్నారు. చిచ్చుబుడ్లు మట్టితోటి చేసినవి ఒకటి రూ.30, కంపెనీల చిచ్చుబుడ్లు చిన్నవి బాక్సు రూ.100 నుంచి రూ.200 వరకు వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. ధరలు మండిపోతుండడంతో బాణసంచా కొనుగోలుకు ప్రజలు అంతగా ఆసక్తి చూపడంలేదు. దీంతో ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బాణసంచా విక్రయ కేంద్రాలు బుధవారం సాయంత్రం వరకు తక్కువ మంది కొనుగోలుదారులు కనిపించారు. అయితే ధరలు తక్కువగా వుంటాయన్న ఉద్దేశంతో కొనుగోలుదారుల హోల్‌సేల్ షాపులకు వెళుతున్నారు.