Share News

డెయిరీ మొండివైఖరి

ABN , Publish Date - Oct 31 , 2024 | 01:16 AM

పాల సేకరణ ధరను తగ్గిస్తూ విశాఖ డెయిరీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై ఉత్తరాంధ్ర వ్యాప్తంగా పాల ఉత్పత్తిదారులు (రైతులు) తమ ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. రెండు వారాల నుంచి పాల సేకరణ కేంద్రాల వద్ద వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నప్పటికీ పాల సేకరణ ధర విషయంలో డెయిరీ చైర్మన్‌, అధికారుల నుంచి కనీసం స్పందన వుండడంలేదు. దీంతో పాల ఉత్పత్తిదారులు మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

డెయిరీ మొండివైఖరి

పాడి రైతుల గోడు పట్టని విశాఖ డెయిరీ యాజమాన్యం

పాల ధర తగ్గింపుపై రెండు వారాలుగా నిరసనలు

డెయిరీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన

అయినా నోరు మెదపని చైర్మన్‌, అధికారులు

పాల ఉత్పత్తిదారుల్లో పెరుగుతున్న అసంతృప్తి జ్వాలలు

చోడవరం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): పాల సేకరణ ధరను తగ్గిస్తూ విశాఖ డెయిరీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై ఉత్తరాంధ్ర వ్యాప్తంగా పాల ఉత్పత్తిదారులు (రైతులు) తమ ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. రెండు వారాల నుంచి పాల సేకరణ కేంద్రాల వద్ద వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నప్పటికీ పాల సేకరణ ధర విషయంలో డెయిరీ చైర్మన్‌, అధికారుల నుంచి కనీసం స్పందన వుండడంలేదు. దీంతో పాల ఉత్పత్తిదారులు మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ డెయిరీ యాజమాన్యం ఆవు పాల ధరను లీటరు రూ.3 తగ్గిస్తూ ఈ నెల 16న తీసుకున్న నిర్ణయం పాల రైతుల్లో ప్రకంపనలు రేపింది. గ్రామీణ ప్రాంతంలో పశుపోషణపై ఆధారపడిన రైతులంతా డెయిరీ తీసుకున్న నిర్ణయంతో డీలాపడ్డారు. ఆవు పాల సేకరణ ధర తగ్గింపుపై నిరసన వ్యక్తం చేస్తూ పాల కేంద్రాల వద్ద ఆందోళనలు చేస్తున్నారు. పాల సేకరణ ధరతోపాటు, డెయిరీ యాజమాన్యం గతంలో ఇచ్చిన పలురకాల రాయితీలను కుదించడం, బోనస్‌లుతగ్గించడాన్ని పాల ఉత్పత్తిదారులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. డెయిరీ యాజమాన్యం ఒంటెత్తు పోకడలను నిరసిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలకు దిగారు. వీరికి వామపక్షాలు, జనసేన పార్టీ నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. విశాఖ డెయిరీ ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సభ్య రైతులు ఆందోళనకు దిగడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. పాల సేకరణ ధరను పెంచడంతోపాటు, రైతులకు ఇచ్చే రాయితీలు కొనసాగించాలని ఆందోళనలు చేస్తున్నప్పటికీ యాజమాన్యం నుంచి కనీస స్పందన లేకపోవడం విస్మయానికి గురిచేస్తున్నది. విశాఖ డెయిరీ కంటే ప్రైవేటు డెయిరీలు పాల సేకరణకు ఎక్కువ ధర చెల్లిస్తున్నప్పటికీ, విశాఖ డెయిరీ తమది అన్న భావనతోనే పాలు పోస్తున్నామని రైతులు చెబుతున్నారు. కానీ డెయిరీ యాజమాన్యం ఈ విధంగా వ్యవహరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయితీలు, బోనస్‌లలో కోతలు విధిస్తూ తమను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్న భావనలో రైతులు ఉన్నారు. విశాఖ డెయిరీ యాజమాన్యం గతంలో పాల ఉత్పత్తిదారులకు అండగా ఉండేదని, తులసీరావు తదనంతరం వచ్చిన పాలకవర్గం ఒంటెత్తు పోకడలతో నిర్ణయాలు తీసుకుంటున్నదని రైతులు ఆరోపిస్తున్నారు. తాము పోస్తున్న పాలతో డెయిరీ యాజమాన్యం వ్యాపారం చేస్తూ భారీగా లాభాలు పొందుతున్నదని, కానీ తమను నిర్లక్ష్యం చేయడం శోచనీయమని సభ్య రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం దిగొచ్చి, పాల సేకరణ ధరను పెంచాలని, లేదంటే రానున్న రోజుల్లో తీవ్ర ప్రతిఘటన తప్పదని రైతులు హెచ్చరిస్తున్నారు.

విశాఖ డెయిరీ నిర్ణయంతో నష్టం

శిలపరశెట్టి ముసలినాయుడు, పాల సంఘం మాజీ డైరెక్టర్‌, చౌడువాడ, కె.కోటపాడు మండలం

విశాఖ డెయిరీ యాజమాన్యం ఆవు పాల ధర లీటరుకు రూ.4 తగ్గించింది. నేను రోజూ 12 లీటర్ల పాలు సరఫరా చేస్తున్నాను. రోజుకు రూ.48 చొప్పున నెలకు సుమారు రూ.1,500 నష్టపోతున్నాను. ఈ డబ్బులతో బస్తా దాణా వస్తుంది. పాల సేకరణ తగ్గింపు వల్ల పశుపోషణ మరింత భారం అవుతుంది.

పాల ధరను పెంచకపోగా.. మరింత తగ్గిస్తారా!

డోకల దేముడుబాబు, జీడిపల్లి, చీడికాడ మండలం

నానాటికీ పెరిగిపోతున్న దాణా ధరలతో పోలిస్తే.. డెయిరీ యాజమాన్యం పాల సేకరణకు చెల్లిస్తున్న ధర తక్కువే. ఇటువంటి తరుణంలో పాల సేకరణ ధరలను పెంచకపోగా, ఉన్న ధరలను మరింత తగ్గించడం దారుణం. పాల రైతులను ఆదుకోకపోగా, ఇబ్బందులకు గురిచేయడం యాజమాన్యానికి తగదు.

Updated Date - Oct 31 , 2024 | 01:16 AM