పర్యాటకుల సందడి
ABN , Publish Date - Oct 20 , 2024 | 10:48 PM
మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లో ఆదివారం సందడి నెలకొంది. ఏజెన్సీలో ఎక్కడ చూసినా సందర్శకులే కనిపించారు. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందడి కనిపించింది.
జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు రద్దీ
పాలసంద్రాన్ని తలపించిన చెరువులవేనం, వంజంగి హిల్స్ వద్ద కోలాహలం
పాడేరు/పాడేరు రూరల్/చింతపల్లి/అరకులోయ/అనంతగిరి/డుంబ్రిగుడ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి):
మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లో ఆదివారం సందడి నెలకొంది. ఏజెన్సీలో ఎక్కడ చూసినా సందర్శకులే కనిపించారు. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందడి కనిపించింది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, గిరి గ్రామదర్శిని, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి గెడ్డ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్, చెరువులవేనం మేఘాల కొండ, లంబసింగి, యర్రవరం జలపాతం తదితర ప్రాంతాలను పర్యాటకులు సందర్శించారు.
వంజంగి మేఘాల కొండపై..
మండలంలోని వంజంగి మేఘాల కొండ ఆదివారం పర్యాటకులతో రద్దీగా కనిపించింది. మేఘాల కొండపై పాల సముద్రాన్ని తలపించే మంచు మేఘాలు, సూర్యోదయం వేళ భానుడి కిరణాలను వీక్షించేందుకు వేకువజామునే పర్యాటకులు ఇక్కడికి వచ్చారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు శనివారం రాత్రి పాడేరులో బస చేసి వేకువజామునే మేఘాల కొండకు చేరుకున్నారు. ప్రకృతి అందాలను తిలకించి పరవశించి పోయారు.
లంబసింగిలో..
ఆంధ్ర కశ్మీర్ లంబసింగి ప్రకృతి అందాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద ఆవిష్కృతమవుతున్న మంచు మేఘాలు పర్యాటకుల మదిని దోచేస్తున్నాయి. ఉదయం ఐదు గంటల నుంచే లంబసింగి జంక్షన్, తాజంగి జలాశయం, చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద పర్యాటకుల సందడి ప్రారంభమైంది. చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద పచ్చని అడవులను తాకుతూ పయనిస్తున్న మంచు మేఘాలను పర్యాటకులు ఆస్వాదించారు. శ్వేత వర్ణంలోని మంచు మేఘాలను చీల్చుకుని బయటకు వస్తున్న సూర్యకిరణాలను కెమెరాలో బంధించేందుకు పర్యాటకులు పోటీ పడ్డారు. సాయంత్రం వరకు పర్యాటక ప్రాంతాలు రద్దీగా కనిపించాయి.
బొర్రాగుహల వద్ద..
అనంతగిరి మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహలకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. 2500 మంది పర్యాటకులు గుహల అందాలను తిలకించగా, రూ.2 లక్షల ఆదాయం వచ్చిందని మేనేజర్ గౌరీ శంకర్ తెలిపారు.
మాడగడ అందాలకు ఫిదా
అరకులోయ మండలంలోని మాడగడ సన్‌రైజ్ అందాలకు పర్యాటకులకు ఫిదా అయ్యారు.. వాతవరణం అనుకూలంగా ఉండడంతో పొగమంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. వీటిని తిలకించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చి, గిరిజన సంప్రదాయ పద్ధతిలో థింసా నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేశారు.
చాపరాయి వద్ద..
డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జల విహారి పర్యాటకులతో కిటకిటలాడింది. దూర ప్రాంతాల నుంచి సైతం పర్యాటకులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. అలాగే మండలంలోని అంజోడ సిల్క్ ఫారం వద్ద కూడా సందడి నెలకొంది.