వృథాగా భవనాలు.. బాలికల వెతలు
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:38 AM
తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో వున్నప్పుడు ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో చదువున్న బీసీ బాలికల కోసం నిర్మాణం చేపట్టిన వసతిగృహాలను వైసీపీ ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురాకుండా ఐదేళ్లపాటు వృథాగా వుంచేసింది. సబ్బవరంలోని హాస్టల్ భవనంలో ఫ్లోరింగ్, కరెంటు, నీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే వందలాది మంది బాలికలకు వసతి కల్పించవచ్చు. రాంబిల్లిలోని హాస్టల్ భవనం నాలుగేళ్ల క్రితమే పూర్తికాగా, వినియోగంలోకి తీసుకురాకపోవడంతో పాడైపోతున్నది.
గత టీడీపీ హయాంలో సబ్బవరం, రాంబిల్లిల్లో బాలికల హాస్టళ్లు మంంజూరు
ఒక్కోదానికి రూ.2 కోట్లు నిధులు
చివరి దశలో పనులు.. మారిన ప్రభుత్వం
ఐదేళ్లపాటు నిరుపయోగంగా ఉంచిన వైసీపీ పాలకులు
కూటమి ప్రభుత్వంపైనే విద్యార్థినుల ఆశలు
సబ్బవరం/ రాంబిల్లి, అక్టోబరు 1 : తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో వున్నప్పుడు ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో చదువున్న బీసీ బాలికల కోసం నిర్మాణం చేపట్టిన వసతిగృహాలను వైసీపీ ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురాకుండా ఐదేళ్లపాటు వృథాగా వుంచేసింది. సబ్బవరంలోని హాస్టల్ భవనంలో ఫ్లోరింగ్, కరెంటు, నీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే వందలాది మంది బాలికలకు వసతి కల్పించవచ్చు. రాంబిల్లిలోని హాస్టల్ భవనం నాలుగేళ్ల క్రితమే పూర్తికాగా, వినియోగంలోకి తీసుకురాకపోవడంతో పాడైపోతున్నది.
సబ్బవరంలోని ఉన్నత పాఠశాల, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న స్థానికేతరులైన (సబ్బవరానికి ఐదు కిలోమీటర్ల పైబడి దూరం) బీసీ బాలికలు, యువతుల కోసం 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం హాస్టల్ భవనం నిర్మించాలని నిర్ణయించింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హ్యామ్) పథకం కింద రూ.2 కోట్లు మంజూరు చేసింది. స్థానిక హైస్కూల్ ఆవరణలో భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. భవన నిర్మాణం పూర్తయ్యే సమయానికి ప్రభుత్వం మారిపోయింది. వైసీపీ ఆధికారంలోకి వచ్చింది. అప్పటికి ఫ్లోరింగ్, విద్యుత్తు, ఇతర మౌలిక సదుపాయాల పనులు మిగిలి ఉన్నాయి.రూ.50 లక్షలు కేటాయిస్తే ఈ పనులు పూర్తవుతాయి. కానీ వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. నాడు శంకుస్థాపన చేసి, భవన నిర్మాణ పనులు చేపట్టిన టీడీపీ ప్రభుత్వమే మళ్లీ అధికారంలో వుండడంతో నిధులు మంజూరు చేసి, హాస్టల్ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావలని విద్యార్థినులు కోరుతున్నారు.
రాంబిల్లిలో..
రాంబిల్లి హైస్కూల్ ఆవరణలో 2019 జవవరి 29వ తేదీన అప్పటి ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు బాలికల వసతిగృహం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) ఫేజ్-5 కింద కోటి 94 లక్షల 21 వేల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఐదు నుంచి 10వ తరగతివరకు చదువుతున్న స్థానికేతరులైన బాలికలకు ఇక్కడ వసతి కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగాయి. అదే ఏడాది వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికి చాలా వరకు పనులు పూర్తయ్యాయి. వైసీపీ ప్రభుత్వం మిగిలిన పనులు పూర్తిచేయకుండా భవనాన్ని గాలికొదిలేసింది. ఐదున్నరేళ్ల క్రితం అప్పటి టీడీపీ ప్రభుత్వం హాస్టల్ భవన నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం ఆ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వున్నందున బాలికల వసతిగృహం పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.