Share News

బాక్సింగ్‌ రింగ్‌కు బ్రేకులు

ABN , Publish Date - Sep 12 , 2024 | 01:21 AM

స్థానిక మునిసిపాలిటీలో బాక్సింగ్‌ రింగ్‌ ఇండోర్‌ హాల్‌ పనులు నిలిచిపోయాయి. స్కేటింగ్‌ రింక్‌ ఆవరణలో ఉన్న స్థలంలో బాక్సింగ్‌ రింగ్‌, ఇండోర్‌ హాల్‌ నిర్మాణం చేయడం పట్ల స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్‌ అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో సంబంధిత అధికారులు పనులు ఆపేశారని సమాచారం.

బాక్సింగ్‌ రింగ్‌కు బ్రేకులు
ఆగిపోయిన బాక్సింగ్‌ రింగ్‌ నిర్మాణ పనులు

నిలిచిపోయిన నిర్మాణ పనులు

స్కేటింగ్‌ రింక్‌ స్థలంలో బాక్సింగ్‌ రింగ్‌ నిర్మించడంపై స్పీకర్‌ ఆగ్రహం?

నిధులను ఇతర ప్రాజెక్టులకు వినియోగించాలని కలెక్టర్‌ ఆదేశం

నర్సీపట్నం, సెప్టెంబరు 11: స్థానిక మునిసిపాలిటీలో బాక్సింగ్‌ రింగ్‌ ఇండోర్‌ హాల్‌ పనులు నిలిచిపోయాయి. స్కేటింగ్‌ రింక్‌ ఆవరణలో ఉన్న స్థలంలో బాక్సింగ్‌ రింగ్‌, ఇండోర్‌ హాల్‌ నిర్మాణం చేయడం పట్ల స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్‌ అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో సంబంధిత అధికారులు పనులు ఆపేశారని సమాచారం.

బాక్సింగ్‌ క్రీడాకారులు శిక్షణ తీసుకోవడానికి నర్సీపట్నంలో రింగ్‌, ఇండోర్‌ హాల్‌ నిర్మాణం కోసం 2023లో అప్పటి జిల్లా కలెక్టర్‌ రూ.60 లక్షలు మంజూరు చేశారు. బాక్సింగ్‌ రింగ్‌, ఇండోర్‌ హాల్‌ నిర్మాణం కోసం పట్టణంలో పలు ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఎక్కడా సరైన స్థలం లభించకపోవడంతో ఆర్‌అండ్‌బీ అధికారులు ఏరియా ఆస్పత్రి ఎదురుగా ఉన్న స్కేటింగ్‌ రింక్‌ ఆవరణలోని ఆరు సెంట్ల ఖాళీ స్థలంలో బాక్సింగ్‌ రింగ్‌, హాల్‌ నిర్మాణ పనులను ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలు పెట్టారు. పునాదుల గోతులు తవ్వి, పిల్లర్ల పనులు చేపట్టారు. బాక్సింగ్‌ రింగ్‌, ఇతర సామగ్రి సరఫరా టెండర్‌ను నర్సీపట్నంలోని జీఆర్‌ స్పోర్ట్స్‌ దక్కించుకుంది. తరువాత ఎన్నికలు జరిగి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. కాగా రుత్తల లచ్చాపాత్రుడు నందన వనంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కేటింగ్‌ రింక్‌ ఏర్పాటు చేయడానికి అప్పుడు మంత్రిగా వున్న సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు కృషి చేశారు. ఇక్కడ జిల్లా, రాష్ట్రస్థాయి స్కేటింగ్‌ పోటీలు నిర్వహించడానికి వీలుగా ఉంటుందని భావించారు. కాగా స్కేటింగ్‌ రింక్‌ ఆవరణలో ఉన్న స్థలంలో బాక్సింగ్‌ రింగ్‌, ఇండోర్‌ హాల్‌ నిర్మాణం చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో ఆర్‌అండ్‌బీ అధికారులు పనులు ఆపేశారు.

ఇతర ప్రాజెక్టులకు నిధులు మళ్లింపు

జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆధ్వర్యంలో మంగళవారం అనకాపల్లిలో స్పోర్ట్స్‌ అథారిటీ ప్రాజెక్ట్‌ల మీద సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్తగా స్పోర్ట్స్‌ ప్రాజెక్ట్‌ల ఆవశ్యకత, నిర్మాణంలో ఉన్న పనులపై సమీక్ష జరిగింది. నర్సీపట్నంలో నిలిచిపోయిన బాక్సింగ్‌ రింగ్‌, ఇండోర్‌ హాల్‌ నిధులను వేరే ప్రాజెక్టుకు ఉపయోగించాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. కాగా నర్సీపట్నంలో శిక్షణ తీసుకుంటున్న బాక్సింగ్‌ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తున్నారు. బాక్సింగ్‌ రింగ్‌ ఉంటే శిక్షణకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ మైదానంలో ప్రాక్టీస్‌ చేసి, రింగ్‌లో పోటీ పడాలంటే ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల బాక్సింగ్‌ రింగ్‌, ఇండోర్‌ హాల్‌ను మరోచోట అయినా నిర్మించాలని క్రీడాకారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Sep 12 , 2024 | 01:21 AM