Share News

పంట నష్టంపై అంచనా

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:29 AM

బంగాళాఖాతంలో ఇటీవల తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు చింతపల్లి సబ్‌ డివిజన్‌ పరిధిలో 1,310 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని స్థానిక వ్యవసాయశాఖ సహాయక సంచాలకులు(ఏడీఏ) కంటా జాహ్నవి తెలిపారు.

పంట నష్టంపై అంచనా
జీకేవీధి మండలం తోకరాయిలో భారీ వర్షాలకు రాళ్లు, బురద ముంచెత్తిన వరి పంటపొలాలను పరిశీలిస్తున్న అధికారులు

చింతపల్లి సబ్‌ డివిజన్‌లో నీట మునిగిన 1,310 ఎకరాలు

గ్రామాల్లో సర్వే కొనసాగిస్తున్న వ్యవసాయ సిబ్బంది

పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదిక

వ్యవసాయశాఖ సహాయక సంచాలకులు జాహ్నవి

జీకేవీధి మండలంలోని నాలుగు పంచాయతీల్లో 435 ఎకరాలకు నష్టం

చింతపల్లి, సెప్టెంబరు 15: బంగాళాఖాతంలో ఇటీవల తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు చింతపల్లి సబ్‌ డివిజన్‌ పరిధిలో 1,310 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని స్థానిక వ్యవసాయశాఖ సహాయక సంచాలకులు(ఏడీఏ) కంటా జాహ్నవి తెలిపారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ గత ఆదివారం గిరిజన ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు రైతులు పంటలను నష్టపోవాల్సి వచ్చిందన్నారు. గూడెంకొత్తవీధి మండలంలో భారీగా పంటలు దెబ్బతిన్నాయన్నారు. ప్రాథమిక సర్వే ప్రకారం చింతపల్లి మండలంలో 250 ఎకరాల్లో వరి, 10 ఎకరాల్లో రాగి, ఐదు ఎకరాల్లో మొక్కజొన్న, ఐదు ఎకరాల్లో సామ పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. గూడెంకొత్తవీధిలో వెయ్యి ఎకరాల్లో వరి, 15 ఎకరాల్లో వేరుశనగ, 15 ఎకరాల్లో రాగి, 5 ఎకరాల్లో సామ, కొయ్యూరులో ఐదు ఎకరాల్లో వరి పంటలకు నష్టం జరిగిందన్నారు. ప్రస్తుతం మూడు మండలాల్లో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ, ఉద్యాన సహాయకులు పర్యటిస్తూ సర్వే చేస్తున్నారన్నారు. మరో ఐదు రోజుల్లో తుది నివేదిక వస్తుందన్నారు. ప్రాథమిక సర్వే ఆధారంగా 1,310 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు. ప్రభుత్వం పంట నష్టం విడుదల చేయగానే రైతులకు అందజేస్తామని చెప్పారు. రైతులు పంట నష్టంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వర్షాలు తెరిపి ఇవ్వడంతో పంటలను సంరక్షించుకునే సస్యరక్షణ చర్యలను రైతులు ప్రారంభించాలన్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు రైతులు పంటలను కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

నాలుగు పంచాయతీల్లో..

సీలేరు: జీకేవీధి మండలం ధారకొండ, గుమ్మిరేవుల, దుప్పులవాడ, సీలేరు పంచాయతీల్లో ఆదివారం ఎంపీడీవో ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులు భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. నాలుగు పంచాయతీల పరిధిలో 435 ఎకరాల పంటకు నష్టం జరిగిందని, 54 ఇళ్లకు నష్టం వాటిల్లగా, అందులో 7 ఇళ్లు పూర్తిగా, 47 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్టు గుర్తించారు. ఐదు పాఠశాల భవనాలు, 15 చెక్‌ డ్యామ్‌లు దెబ్బతిన్నట్టు నిర్ధారించారు. ఐదు వంతెనలు, ఐదు చిన్న కల్వర్టులకు నష్టం వాటిల్లిందని, 8 గ్రావిటీ స్కీమ్‌లకు నష్టం జరిగినట్టు గుర్తించారు. మూడు అంగన్‌వాడీ భవనాలు, మూడు తారు రోడ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, 12 జతల ఎడ్లు, 60 కోళ్లు మృతి చెందినట్టు మండల స్థాయి అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్‌డీ పాపారావు, మండల వ్యవసాయాధికారి మధుసూదన్‌, హౌసింగ్‌ ఏఈ సూరిబాబు, సీలేరు, దుప్పులవాడ కార్యదర్శులు శ్రీనివాస్‌, వెంకటరావు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ కుసుమరాణి, సర్పంచ్‌ పి.దుర్జో , కూటమి నాయకులు పాల్గొన్నారు.

వారం రోజులు ఇబ్బంది పడ్డాం

జీకేవీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీ పరిధిలోని మాదిమళ్లు, చోడిరాయి తదితర గ్రామాల్లో వరద నష్టాన్ని అంచనా వేయడానికి వెళ్లిన అధికారులను స్థానికులు నిలదీశారు. భారీ వర్షాల కారణంగా విద్యుత్‌ సౌకర్యం, తాగునీరు లేక వారం రోజులపాటు ఇబ్బందులు పడ్డామని, వంతెనలు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయని చెప్పారు. ఇంత జరిగినా మంత్రులు, కలెక్టర్‌, ఐటీడీఏ పీవో ఎందుకు రాలేదని నిలదీశారు. ఉన్నతాధికారులు వచ్చి పరిశీలిస్తేనే కదా తమ బాధలు తెలుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Sep 16 , 2024 | 12:29 AM