గంజాయిపై ‘ఈగల్’ కన్ను!
ABN , Publish Date - Nov 29 , 2024 | 10:41 PM
ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉండడంతో గంజాయి సాగు, రవాణాపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. ఇప్పటికే గిరిజన ప్రాంతంలోని గంజాయి తోటలు ధ్వంసం చేయడం, రవాణాను అడ్డుకునేందుకు వాహన తనిఖీలు చేపడుతున్నప్పటికీ, ఇకపై పటిష్ట ప్రణాళికతో కట్టడి చేయనుంది.
పాడేరు కేంద్రంగా రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకు నిర్ణయం
గంజాయి అక్రమార్కులు తప్పించుకోకుండా పక్కా వ్యూహం
స్మగ్లర్ల ఆస్తుల జప్తు, సాగుదారులకు పథకాల రద్దుకు యోచన
రాష్ట్రాన్ని గంజాయి రహితం దిశగా కూటమి సర్కార్ పటిష్ట చర్యలు
‘ఈగల్ అధిపతి’కి మన్యం పరిస్థితులు సుపరిచితమే
(పాడేరు-ఆంధ్రజ్యోతి)
ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉండడంతో గంజాయి సాగు, రవాణాపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. ఇప్పటికే గిరిజన ప్రాంతంలోని గంజాయి తోటలు ధ్వంసం చేయడం, రవాణాను అడ్డుకునేందుకు వాహన తనిఖీలు చేపడుతున్నప్పటికీ, ఇకపై పటిష్ట ప్రణాళికతో కట్టడి చేయనుంది. ఇందుకోసం ఐజీ ర్యాంక్ అధికారి ఆకే.రవికృష్ణ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి కట్టడికి ప్రత్యేకంగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగల్) పేరిట ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయనుంది. అలాగే అమరావతి, విశాఖ, పాడేరుల్లో రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. వాటికి అధిపతులుగా డీఎస్‌పీ స్థాయి అధికారులను నియమించనున్నారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఒక ఎస్‌ఐ స్థాయి అధికారి నేతృత్వంలో నార్కోటిక్ సెల్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో గంజాయి మూలలను గుర్తించి సమూలంగా దానిని నిర్మూలించే దిశగా ‘ఈగల్’ వ్యవస్థ ప్రత్యేక కార్యాచరణతో రంగంలోకి దిగనుంది. అలాగే ఈగల్‌కు అధిపతిగా వ్యవహరించే ఐజీ రవికృష్ణ గతంలో చింతపల్లి ఏఎస్‌పీగా పనిచేశారు. ఆయనకు మన్యంలోని పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. ఆయన ఏఎస్‌పీగా పనిచేసిన కాలంలో మావోయిస్టుల ప్రభావాన్ని తగ్గించేందుకు శాంతియుత మార్గాల్లో చర్యలు చేపట్టారు.
వైసీపీ పాలనలో పెరిగిన గంజాయి సాగు
ఐదేళ్ల వైసీపీ పాలనలో అల్లూరి జిల్లాలో గంజాయి సాగు పెరిగి రాష్ట్రానికి గంజాయి హబ్‌గా మార్చేశారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మన్యంలో పండే గంజాయి రాష్ట్రాలు దాటడడంతోపాటు ఆఖరుకు పాఠశాల విద్యార్థుల సంచుల్లోకి చేరిందని ఆరోపణలున్నాయి. నాటి ప్రభుత్వం గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని కూటమి ప్రభుత్వంలోని పెద్దలు సైతం అనేక సందర్భాల్లో విమర్శించారు. గంజాయి కారణంగా సమాజం చెడిపోవడంతో దేశంలో రాష్ట్రానికి విపరీతమైన చెడ్డపేరు వస్తుంది. ఈ తరుణంలో గంజాయి సమూలంగా నిర్మూలించాలని కూటమి సర్కారు నిర్ణయించి తొలుత మంత్రులతో సబ్ కమిటీ వేసింది. ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించింది. తాజాగా ‘ఈగల్’ అనే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ వ్యవస్థ ద్వారా గంజాయి కట్డడికి రంగంలోకి దిగుతున్నది.
స్మగ్లర్ల ఆస్తుల జప్తు,
సాగుదారుల పథకాల రద్దుకు యోచన
రాష్ట్రాన్ని గంజాయి రహితం చేయడంలో భాగంగా స్మగ్లర్ల ఆస్తులను జప్తు చేయడంతోపాటు సాగు చేస్తున్న వారిని గుర్తించి ప్రభుత్వ పథకాలను రద్దు చేయాలనే యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. అలాగే ఇదే అంశంపై విశాఖ పోలీస్ రేంజ్ పరిధిలోని ఉన్నతాధికారులతో ఇటీవల డీఐజీ గోపినాథ్ జెట్టి ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గంజాయిని సంపూర్ణంగా అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని డీఐజీ ఆదేశించారు.