Share News

హోటళ్లన్నీ ఫుల్‌

ABN , Publish Date - Oct 20 , 2024 | 01:25 AM

నగరం అతిథులతో కళకళలాడుతోంది. హోటళ్లన్నీ ఫుల్‌ అయిపోయాయి.

హోటళ్లన్నీ ఫుల్‌

ఒకపక్క పర్యాటకులు

మరొకపక్క పెళ్లిళ్లు

వైద్యుల సదస్సుకు 2,500 రూమ్‌లు రిజర్వు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరం అతిథులతో కళకళలాడుతోంది. హోటళ్లన్నీ ఫుల్‌ అయిపోయాయి. కొత్తగా ఎవరైనా నగరంలోకి వచ్చినా, సమావేశం ఏర్పాటు చేసుకుందామని యత్నించినా స్టార్‌ హోటళ్లలో రూమ్‌లు, హాళ్లు లభించడం లేదు. ఇది పూర్తిగా పర్యాటక సీజన్‌. దసరా నుంచి విశాఖకు పశ్చిమ బెంగాల్‌, ఒడిశాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తారు. విశాఖలో రెండు, మూడు రోజులు గడిపి తరువాత ఏజెన్సీకి వెళుతుంటారు. పర్యాటక శాఖకు సంబంధించి నగరంలో ఎటువంటి వసతి లేకపోవడంతో అంతా ప్రైవేటు హోటళ్లనే ఆశ్రయిస్తున్నారు. వీరు కాకుండా విశాఖకు రెగ్యులర్‌గా వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలపై వచ్చేవారు ఉంటారు. ఇక గత వారం రోజులుగా వివిధ శుభకార్యాలకు హాజరు కావడానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి సంఖ్య బాగా పెరిగింది.

వైద్యుల సదస్సుతో బిజీ

నగరంలో ఈ నెల 16న న్యూరాలజీ జాతీయ సదస్సు-2024 మొదలైంది. ఐదు రోజులు సాగే ఈ సదస్సును నోవాటెల్‌లో నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనడానికి దేశ, విదేశాల నుంచి సుమారు 2,500 మంది వైద్యులు వచ్చారు. వారి కోసం మూడు నెలల ముందే వివిధ హోటళ్లలో రూమ్‌లు బుక్‌ చేశారు. విశాఖపట్నంలో టు స్టార్‌ నుంచి ఫైవ్‌ స్టార్‌ హోటళ్ల వరకు అన్నింటినీ లెక్కలోకి తీసుకుంటే సుమారు మూడు వేల రూమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో 2,500 రూమ్‌లు వైద్యులకే కేటాయించడంతో గత ఐదు రోజులుగా కుటుంబాలతో వచ్చే వారికి స్టార్‌ హోటళ్లలో రూమ్‌లు దొరకడం లేదు. దీంతో చిన్న చిన్న లాడ్జీలను ఆశ్రయిస్తున్నారు. ఎప్పుడూ స్టార్‌ హోటళ్లలో సమావేశాలు నిర్వహించే భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కూడా సరైన వసతి దొరక్కపోవడంతో శనివారం పందిమెట్టలోని రాక్‌డేల్‌ హోటల్‌లో సమావేశం నిర్వహించుకుంది. నగరంలో హోటళ్లకు పెరిగిన డిమాండ్‌కు ఇదే నిదర్శనమని సీఐఐ ప్రతినిధులు చెబుతున్నారు.

ఈ సీజన్‌ బాగుంటుంది (ఫొటో హోటల్‌ వీపీ అని ఉంది.)

పవన్‌ కార్తీక్‌, ఉపాధ్యక్షులు, ఏపీ హోటల్స్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ అసోసియేషన్‌

విశాఖపట్నానికి ఈ పర్యాటక సీజన్‌ బాగుంటుందనే సూచనలు కనిపిస్తున్నాయి. దసరా నుంచి సీజన్‌ మొదలైంది. ఆరంభం బాగానే ఉంది. వైద్యుల సదస్సుతో మంచి ఆక్యుపెన్సీ వచ్చింది. అదే కొనసాగుతోంది. జనవరి నెలాఖరు వరకు ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాం. ఈసారి పర్యాటక శాఖ విశాఖ ఉత్సవ్‌ నిర్వహించే అవకాశం ఉన్నందున పర్యాటకులు ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Updated Date - Oct 20 , 2024 | 01:25 AM