ఆడుకునేందుకు వెళ్లి మృత్యువాత
ABN , Publish Date - Sep 12 , 2024 | 01:23 AM
వర్షం తెరిపి ఇవ్వడంతో ఆడుకునేందుకు వెళ్లిన ఓ బధిర బాలిక ప్రమాదవశాత్తూ కొండవాగు ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందింది. ఈ విషయం బుధవారం సాయంత్రం గోధుమలంక గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించి గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
- కొండవాగు ప్రవాహంలో కొట్టుకుపోయిన బధిర బాలిక
- గోధుమలంక గ్రామంలో ఘటన
- ఆలస్యంగా వెలుగులోకి..
కొయ్యూరు, సెప్టెంబరు 11: వర్షం తెరిపి ఇవ్వడంతో ఆడుకునేందుకు వెళ్లిన ఓ బధిర బాలిక ప్రమాదవశాత్తూ కొండవాగు ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందింది. ఈ విషయం బుధవారం సాయంత్రం గోధుమలంక గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించి గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని బూదరాళ్ల పంచాయతీ గోధుమలంక గ్రామానికి చెందిన పాంగి సన్యాసిరావు, కాసులి దంపతులకు నలుగురు పిల్లలు. వారిలో పాంగి హిందూ(7) మూడవ సంతానం. ఆ బాలికకు పుట్టుకతోనే మాటలు రావు. కాగా మంగళవారం మధ్యాహ్నం వర్షం తెరిపి ఇవ్వడంతో ఆడుకునేందుకు బయటకు వెళ్లింది. తండ్రి సన్యాసిరావు పశువులను మేపేందుకు వెళ్లగా, తల్లి కాసులి మిగతా పిల్లలతో ఇంట్లోనే ఉంది. మధ్యాహ్నం వెళ్లిన కుమార్తె సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు చుట్టుపక్కల వెదికారు. అయినా ఫలితం లేకపోయింది. బుధవారం ఉదయం నుంచి కొండవాగు ప్రవాహాల్లో గాలించగా సాయంత్రం 5 గంటల సమయంలో ఊరికి కిలోమీటరు దూరంలో గల గోధుమలంక- తీగలమెట్ట గ్రామాల మధ్యలో బొంజంగి గుమ్మి మణుగులో ఆ బాలిక మృతదేహం కనిపించింది. కొండవాగులో కొట్టుకుపోతున్న సమయంలో బధిర బాలిక కావడంతో కేకలు వేయలేకపోయి ఉంటుందని గ్రామస్థులు తెలిపారు. చలాకీగా ఉండే ఆ బాలిక మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.