వసతి గృహాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు
ABN , Publish Date - Oct 20 , 2024 | 11:15 PM
వసతి గృహాల్లో సమస్యలుంటే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎలమంచిలి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి పి.విజయ తెలిపారు.
ఎలమంచిలి సివిల్ కోర్డు సీనియర్ జడ్జి పి.విజయ
పాయకరావుపేట, అక్టోబరు 20 : వసతి గృహాల్లో సమస్యలుంటే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎలమంచిలి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి పి.విజయ తెలిపారు. ఆదివారం స్థానిక ఎస్సీ బాలురు-1, 2, బాలికలు-1, 2తోపాటు బీసీ కాలేజి బాలురు, బాలికల వసతి గృహాలను ఆమె ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆయా వసతి గృహాలో వసతులు, రికార్డులు పరిశీలించారు. అదేవిధంగా మెనూ, వంట గది, మరుగుదొడ్లు, స్టోర్, స్టాక్ రూమ్స్ తనిఖీ చేశారు. అలాగే మెనూ సక్రమంగా పెడుతున్నారా.. లేదా.. అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే తెలియజేయాలని, వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆమె వెంట ప్యానెల్ అడ్వకేట్ టి.నూకరాజు, ఎస్‌ఐ జె.పురుషోత్తం, కోర్టు సిబ్బంది, వసతి గృహాల వార్డెన్లు ఉన్నారు.
కేజీబీవీని తనిఖీ చేసిన జడ్జి
నక్కపల్లి: స్థానిక కేజీబీవీని ఆదివారం సాయంత్రం ఎలమంచిలి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి పి.విజయ తనిఖీ చేశారు. స్కూల్ రికార్డులు,. బాలికలకు పెడుతున్న భోజనాన్ని పరిశీలించారు. బాలికలతో మాట్లాడారు. ఎటువంటి అసౌకర్యం లేదని బాలికలు చెప్పారు. డిజిటల్ క్లాస్ రూములను జడ్జి పరిశీలించారు. డార్మిటరీ, కిచెన్, వాష్‌రూమ్‌లు, స్టోర్‌రూమ్‌ను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని కేజీబీవీ ఎస్‌వో సలీమా చెప్పారు.
తిమ్మాపురం కేజీబీవీ, ఎస్.రాయవరం హాస్టళ్ల తనిఖీ
ఎస్.రాయవరం: మండలంలోని తిమ్మాపురం కేజీబీవీ, ఎస్.రాయవరం, రేవుపోలవరం బీసీ బాలుర వసతి గృహాలను ఎలమంచిలి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి పి.విజయ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా జడ్జి విజయ ఆయా హాస్టళ్ల విద్యార్థిని, విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలు, మెనూ ప్రకారం భోజనం, చదువు తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరికైన వ్యక్తిగత సమస్య వస్తే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చునని ఆమె విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో న్యాయవాది టి. నూకరాజు తదితరులు పాల్గొన్నారు.