Share News

సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో పోడియంల తొలగింపు

ABN , Publish Date - Sep 16 , 2024 | 01:21 AM

సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ఇకపై స్నేహపూర్వకంగా ఉండాల న్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో అధికారులు చర్యలు చేపట్టారు.

సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో పోడియంల తొలగింపు

ఆదివారం సెలవు రోజు అయినా పనులు పూర్తిచేసిన అధికారులు

విశాఖపట్నం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):

సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ఇకపై స్నేహపూర్వకంగా ఉండాల న్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో అధికారులు చర్యలు చేపట్టారు. కార్యాలయాల్లో సబ్‌ రిజిస్ర్టార్‌ ముందు ప్రత్యేకం గా పోడియంలు ఉండడంతో ప్రజలకు, అధికారులకు, ప్రభుత్వానికి మధ్య అంతరం పెరుగుతోందని భావించింది. సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ప్రజలకు తగిన గౌరవాన్ని ఇవ్వాలన్న ఆదేశాలతో జిల్లాలోని సబ్‌ రిజిస్ర్టార్లు చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలోనే కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఉన్న పోడియంలు తొలగించే పనులను చేపట్టారు. ఆదివారం సెలవు అయినప్పటికీ కార్యాలయాలకు వచ్చిన సబ్‌ రిజిస్ర్టార్లు రాత్రి వరకు దగ్గరుండి పనులు చేయించారు. వన్‌టౌన్‌లోని టర్నర్‌ చౌల్ర్టీ వద్ద ఉన్న సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు పనులు కొనసాగాయి.

30 నుంచి రేషన్‌ డిపోల హేతుబద్ధీకరణ!

జిల్లాలో 413 దుకాణాల నుంచి కార్డుల విభజన

గ్రామీణంలో 600, నగరంలో 800 కార్డులు దాటిన డిపోల గుర్తింపు

150 కొత్త డిపోల ఏర్పాటుకు అవకాశం

విశాఖపట్నం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):

బియ్యంకార్డుల ప్రాతిపదికగా రేషన్‌ డిపోలను హేతుబద్ధీకరించనున్నారు. గ్రామీణ ప్రాంతంలో 600 కార్డులు, నగరంలో 800 కార్డులు దాటిన డిపోలను గుర్తించి అవసరం మేరకు కొత్త డిపోలు ఏర్పాటుచేస్తారు. ఈ నెలాఖరుకు ప్రక్రియ ప్రారంభించి నవంబరు 23లోగా పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈనెల 30న రేషనలైజేషన్‌కు అర్హత ఉన్న డిపోల వివరాలు, ఖాళీల సంఖ్యను జిల్లాల వారీగా గుర్తించాలని, వచ్చే నెల మూడోతేదీన రేషనలైజేషన్‌ ప్రక్రియ పూర్తిచేయడం, నాలుగోతేదీన కొత్తగా ఏర్పాటుకానున్న డిపోల సంఖ్యను గుర్తించడం, 24న ఖాళీల సంఖ్యతోపాటు కొత్త డిపో వివరాలను ప్రకటించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనంతరం దరఖాస్తులు ఆహ్వానించి నవంబరు ఏడోతేదీన రాత పరీక్ష, ఎనిమిదోతేదీన ఇంటర్వూ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థుల జాబితా 15న ప్రకటించి ఆ మరుసటి రోజు నియామకపత్రాలు అందజేయాలని, ఎంపికైన డీలర్లకు 23న ఈపోస్‌ మిషన్లు అందజేయాలని నిర్దేశించిరు.

జిల్లాలోని నాలుగు మండలాల్లో 138, నగర పరిధిలో 504 మొత్తం 642 రేషన్‌ డిపోలున్నాయి. గ్రామీణ ప్రాంతంలో 600 కార్డుల కంటే ఎక్కువగా 37 డిపోలున్నాయి. నగర పరిధిలో 800 కార్డుల కంటే ఎక్కువగా 376 డిపోలున్నాయి. 751 నుంచి 1,000 వరకు 197, 1,001 నుంచి 1250 వరకు 135 డిపోలు, 1,251 నుంచి 1,500 కార్డుల వరకు 33 డిపోలు, 1501 కార్డుల కంటే 11 డిపోలున్నాయి. దీంతో కొత్తగా 150 కొత్త డిపోలు వచ్చే అవకాశం ఉంది. ఈ డిపోలు ఎక్కువగా ఆరిలోవ, మధురవాడ పరిధిలోనే ఉన్నాయి. ఇదిలావుండగా జిల్లాలో ఖాళీగా ఉన్న డిపోలపైనా ప్రకటన విడుదల చేయనున్నారు. అయితే గత ఏడాది 36 డిపోలకు సంబంధించి డ్వాక్రా సంఘాలు కోర్టులో వేసిన కేసు పెండింగ్‌లో ఉంది. డ్వాక్రాల పేరిట ఎక్కువగా బినామీలు డిపోలు నిర్వహిస్తున్నారు. సొసైటీల పేరిట ఉన్న డిపోలను తనిఖీచేసి బినామీలను ఏరివేస్తే, వాటికి కూడా నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Sep 16 , 2024 | 01:21 AM