Share News

మన్యంలో ముసురు

ABN , Publish Date - Nov 30 , 2024 | 10:48 PM

ఫెంగల్‌ తుఫాన్‌ ప్రభావంతో మన్యంలో గత రెండు రోజులుగా ముసురు వాతావరణం నెలకొంది. జల్లులు కురుస్తుండడంతో జన జీవనానికి అంతరాయం ఏర్పడింది.

మన్యంలో ముసురు
పాడేరు మండలం ఆడారిమెట్ట వద్ద వరి కుప్పలకు ప్లాస్టిక్‌ కవర్లు కప్పిన రైతులు

ఫెంగల్‌ తుఫాన్‌ ప్రభావంతో జల్లులు

పెరిగిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు

వరి పంటను రక్షించుకుంటున్న రైతులు

పాడేరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఫెంగల్‌ తుఫాన్‌ ప్రభావంతో మన్యంలో గత రెండు రోజులుగా ముసురు వాతావరణం నెలకొంది. జల్లులు కురుస్తుండడంతో జన జీవనానికి అంతరాయం ఏర్పడింది. అయితే తుఫాన్‌ వర్షం కారణంగా వరి పంట పాడవకుండా గిరిజన రైతులు రక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పలువురు రైతులు పంటను కోసి నూర్పులు పూర్తి చేయగా, మరి కొంతమంది కోసిన పనలు పొలాల్లోనే ఉన్నాయి. దీంతో వరి పంటను కుప్పలుగా వేసి వాటికి రక్షణగా ప్లాస్టిక్‌ కవర్లను కప్పుతున్నారు. ఫెంగల్‌ తుఫాన్‌పై ముందు నుంచి రాష్ట్ర విపత్తుల శాఖ ప్రచారం చేయడంతో పంటలను కాపాడుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం జల్లులు మాత్రమే కురుస్తుండడంతో ఇబ్బంది లేదని, భారీ వర్షం కురిస్తే పంట నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

తగ్గిన చలి తీవ్రత

మన్యంలో ఫెంగల్‌ తుఫాన్‌ ప్రభావంతో గత రెండు రోజులుగా చలి తీవ్రత తగ్గింది. ఆకాశం మేఘావృతం కావడంతో మంచు సైతం పెద్దగా కురవడం లేదు. అలాగే మూడు రోజుల క్రితం వరకు సింగిల్‌ డిజిట్‌లో ఉండే కనిష్ఠ ఉష్ణోగ్రతలు డబల్‌ డిజిట్‌కు చేరాయి. ఏజెన్సీలో శనివారం అరకులోయలో 17.6 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా అనంతగిరిలో 17.8, జి.మాడుగులలో 18.3, డుంబ్రిగుడలో 18.5, హుకుంపేటలో 18.9, పాడేరులో 19.1, జీకేవీధిలో 19.3, చింతపల్లిలో 19.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అరకులోయలో

తుఫాన్‌ ప్రభావంతో శనివారం ఉదయం నుంచే అరకులోయలో ముసురు వాతావరణం నెలకొంది. అడపాదడపా జల్లులు కురవడంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అయితే గిరి రైతులు ఈ తుఫాన్‌ నుంచి వరి పంటను దాదాపు కాపాడుకోగలిగారు. తుఫాన్‌ ప్రభావంతో పర్యాటకులు పెద్దగా రాకపోవడం, పర్యాటక ప్రాంతాలు బోసిపోయాయి. రోజంతా ముసురు వాతావరణంతో అధిక శాతం మంది ఇళ్లకే పరిమితమయ్యారు.

చింతపల్లిలో..

తుఫాన్‌ ప్రభావంతో మండలంలో జల్లులు కురిశాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జల్లులు పడ్డాయి. రాత్రికి వర్షం తెరిపిచ్చినప్పటికీ చల్లగాలులు అధికంగా వీస్తున్నాయి. వర్షం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వరి కోతలకు తీవ్ర అంతరాయం కలిగింది. కోతలు చేసుకున్న వరి పనలు కాపాడుకునేందుకు రైతులు ఇబ్బంది పడ్డారు.

Updated Date - Nov 30 , 2024 | 10:48 PM