గ్రామీణ రోడ్లకు కొత్తరూపు
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:44 AM
ఐదేళ్ల నుంచి కనీస నిర్వహణ పనులకు నోచుకోక అత్యంత దారుణంగా తయారైన చోడవరం- పీఎస్‌పేట రహదారికి మంచి రోజులు వచ్చాయి. అడుగడుగునా భారీ గోతులతో అధ్వానంగా వున్న రోడ్డు రూపురేఖలు మార్చే పనులు మొదలయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వం శంకుస్థాపనతో సరిపెట్టిన ఈ రోడ్డు నిర్మాణ పనులు... కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతే మొదలయ్యాయి.
శరవేగంగా చోడవరం- పీఎస్‌పేట రహదారి అభివృద్ధి పనులు
పట్టణ పరిధిలో సీసీ రోడ్డు, డ్రైనేజీలు
మిగిలినచోట తారు రోడ్డు నిర్మాణం
పలు గ్రామాల ప్రజలకు తీరనున్న రవాణా కష్టాలు
చోడవరం, నవంబరు 29: ఐదేళ్ల నుంచి కనీస నిర్వహణ పనులకు నోచుకోక అత్యంత దారుణంగా తయారైన చోడవరం- పీఎస్‌పేట రహదారికి మంచి రోజులు వచ్చాయి. అడుగడుగునా భారీ గోతులతో అధ్వానంగా వున్న రోడ్డు రూపురేఖలు మార్చే పనులు మొదలయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వం శంకుస్థాపనతో సరిపెట్టిన ఈ రోడ్డు నిర్మాణ పనులు... కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతే మొదలయ్యాయి.
చోడవరంలోని కొత్తూరు జంక్షన్ నుంచి పీఎస్‌పేట మీదుగా జన్నవరం వరకు రహదారిపై ఏర్పడిన భారీ గోతులతో పలు గ్రామాల ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చోడవరంలోని కొత్తూరు జంక్షన్ నుంచి పీఎస్‌పేట వరకూ రోడ్డు దారుణంగా తయారైంది. చిన్నపాటి వర్షానికే గోతుల్లో నీరు చేరి పంట కుంటలను తలపించేవి. గోతులు పూడ్చి రోడ్డును బాగు చేయాలని ఆయా పంచాయతీల ప్రజలు ఎన్నిసార్లు మొత్తుకున్నా నాటి వైసీపీ ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. అధికారులను అడిగితే.. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే తామేమి చేయగలమంటూ నిస్సహాయతను వ్యక్తం చేసేవారు. గత ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడతో, ఆటో డ్రైవర్లు శ్రమదానం చేసి గుంతలు పూడ్చారు. ఎట్టకేలకు సాధారణ ఎన్నికలకు కొద్ది నెలల ముందు వైసీపీ ప్రభుత్వం రూ.2.83 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించింది. అయితే గిట్టుబాటు కాదంటూ కాంట్రాక్టర్ పనులు ఆపేశారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ‘పల్లె పండగ’ పేరుతో రోడ్డ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. కొత్తూరు జంక్షన్ నుంచి పీఎస్‌పేట రోడ్డులో సామిల్లు వరకు సీసీ రోడ్డుతోపాటు డ్రైనేజీ కాలువలు నిర్మిస్తున్నారు. ప్రస్త్తుతం డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు ముమ్మంగా సాగుతున్నాయి. దీంతో స్థానికులు, ఈ మార్గంలో రాకపోకలు సాగించే పలు పంచాయతీల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ, కొత్తూరు జంక్షన్ నుంచి సా మిల్లు వరకు సీసీ రోడ్డు, డ్రైనేజీ కాలువలు నిర్మిస్తామని, మిగిలిన రోడ్డును బీటీగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.