Share News

విజయసాయి సమాచారాన్ని దాచారు..

ABN , Publish Date - Sep 05 , 2024 | 03:12 AM

వైసీసీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజకీయ శత్రుత్వంతోనే ఉమ్మడి ఏపీ ప్రభుత్వం.. ఐఎంజీ భారత్‌కు 2003లో చేసిన భూకేటాయింపుపై సీబీఐ దర్యాప్తు కోరుతున్నారని అప్పటి ప్రభుత్వంలో క్రీడాశాఖ మంత్రిగా పనిచేసిన పీ రాములు తెలంగాణ హైకోర్టుకు తెలియజేశారు.

విజయసాయి సమాచారాన్ని దాచారు..

రాజకీయ శత్రుత్వంతో పిటిషన్లు వేశారు

హైకోర్టులో ఉమ్మడి ఏపీ మాజీ క్రీడా మంత్రి పీ రాములు వాదనలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): వైసీసీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజకీయ శత్రుత్వంతోనే ఉమ్మడి ఏపీ ప్రభుత్వం.. ఐఎంజీ భారత్‌కు 2003లో చేసిన భూకేటాయింపుపై సీబీఐ దర్యాప్తు కోరుతున్నారని అప్పటి ప్రభుత్వంలో క్రీడాశాఖ మంత్రిగా పనిచేసిన పీ రాములు తెలంగాణ హైకోర్టుకు తెలియజేశారు. ఐఎంజీ భారత్‌కు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, సరూర్‌నగర్‌ ప్రాంతాల్లో చేసిన భూకేటాయింపుపై మునుపటి లిటిగేషన్ల సమాచారాన్ని న్యాయస్థానానికి చెప్పకుండా దాచిపెట్టారని ఆరోపించారు. ఈ భూకేటాయింపుపై మాజీ సీఎం జగన్‌ తల్లి విజయలక్ష్మి, కాంగ్రెస్‌ నేత పాల్వాయి గోవర్థన్‌ రెడ్డి దాఖలు చేసిన కేసులను న్యాయస్థానాలు కొట్టేశాయని తెలిపారు. విజయసాయి రెడ్డి పిటిషన్‌నూ కొట్టేయాలని కోరారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2003లో ఐఎంజీ భారత్‌కు చేసిన 850 ఎకరాల భూకేటాయింపుపై సీబీఐ దర్యాప్తు కోరుతూ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్‌, ఎంపీ విజయసాయిరెడ్డి, న్యాయవాది టీ శ్రీరంగారావు 2012లో రెండు వేర్వేరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్లు బుధవారం విచారణకు వచ్చాయి. ఈ పిటిషన్లలో ఇంప్లీడ్‌ అయిన ఉమ్మడి ఏపీ మాజీ క్రీడాశాఖ మంత్రి పి రాములు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. పిటిషనర్లలో ఒకరైన విజయసాయిరెడ్డి... జగన్‌కు దగ్గరి వ్యక్తి అని, అక్రమాస్తులు సహా ఆయనపై అనేక కేసులు ఉన్నాయని తెలిపారు. మునుపటి లిటిగేషన్ల సమాచారాన్ని విజయసాయిరెడ్డి దాచి పెట్టారని, ఆయన క్లీన్‌ హ్యాండ్స్‌తో రాలేదని వివరించారు. చాలా ఏళ్ల తర్వాత 2012లో పిటిషన్‌ దాఖలు చేశారని పేర్కొన్నారు. ఐఎంజీకి భూమి కేటాయిస్తూ 2003లో మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం రద్ద అయ్యిందని, కోర్టు తీర్పుతో సదరు భూములు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయని చెప్పారు. 21 ఏళ్ల క్రితం మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయానికి క్రిమినాలిటీ ఆపాదించి దర్యాప్తు కోరడం సరికాదని అభిప్రాయపడ్డారు. అసలు మంత్రివర్గం తీసుకున్న విధాన నిర్ణయాలను ప్రాసిక్యూట్‌ చేయడం సాధ్యం కాదని, రాజకీయ దురుద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేయాలని సిద్ధార్థ లూథ్రా ఽహైకోర్టును కోరారు. కాగా, సీబీఐ దర్యాప్తు కావాలా? వద్దా? స్పష్టంగా చెప్పాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని కోరగా స్పష్టమైన సమాధానం రాలేదు. హైకోర్టు ఎలాంటి ఆదేశాలిచ్చినా శిరసావహిస్తామని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ఆడెపు దివ్య బదులిచ్చారు. కేంద్రం తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ తన వాదన వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక విచారణలో ఏమైనా అక్రమాలు జరిగినట్టు తేలితే సీబీఐతో దర్యాప్తు చేయించేందుకు సిద్ధమని చెప్పారు. వాదనలు నమోదు చేసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

Updated Date - Sep 05 , 2024 | 08:05 AM