ముగ్గురు అంతర్రాష్ట్ర బైకు దొంగల అరెస్టు
ABN , Publish Date - Oct 20 , 2024 | 10:54 PM
అంతర్రాష్ట్ర మోటారు బైకు దొంగలు ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.10 లక్షలు విలువ చేసే 11 మోటారు బైకులు స్వాఽధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్ తెలిపారు.
11 మోటారు బైకులు స్వాధీనం
కోవెలకుంట్ల, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : అంతర్రాష్ట్ర మోటారు బైకు దొంగలు ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.10 లక్షలు విలువ చేసే 11 మోటారు బైకులు స్వాఽధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్ తెలిపారు. ఆదివారం కోవెలకుంట్ల పట్టణంలోని పోలీసుస్టేషనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ, సీఐ హనుమంతనాయక్, ఎస్‌ఐమల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో విలేకరులకు వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నంద్యాల, కడప జిల్లాల్లో పలుచోట్ల బైకు దొంగతనాలు చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణం భాగ్యనగర్‌కు చెందిన హుసేనవలి, ప్రొద్దుటూరుకు చెందిన షేక్ ఫజిల్‌బాషా, మైదుకూరుకు చెందిన వాదనపల్లి అమిర్‌బాషా గత కొంతకాలంగా నంద్యాల, కడప జిల్లాల్లో 11 బైకులు దొంగతనం చేసి, వాటి ఛాసిస్, ఇంజన్లను మార్చి మరో వ్యక్తి పేరుతో రికార్డులు సృష్టించి కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో విక్రయించారని తెలిపారు. కోవెలకుంట్లలో రెండు బైకులు దొంగిలించే సమయంలో సీసీ కెమెరాకు చిక్కారని అన్నారు. ఈ దొంగతనాలపై పోలీసుస్టేషనలో కేసు నమోదు కావడంతో విచారణ చేపట్టారమని అన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి బైకులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను రిమాండుకు తరలించారు. బైకు దొంగతనం కేసు ఛేదించిన సీఐ హనుమంతనాయక్‌ను, ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.