అదే జగన్.. అవే అబద్ధాలు!
ABN , Publish Date - Sep 12 , 2024 | 03:50 AM
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ గుంటూరు జైలు వద్ద చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
నాడు 36 రాజకీయ హత్యలని బొంకులు
నేడు 60 మంది చనిపోయారని అబద్ధాలు
నిరూపించాలని మంత్రులు, నేతల డిమాండ్
నిరూపించలేక చేతులెత్తేసిన వైసీపీ అధినేత
అబద్ధాలతో పుట్టి ఫేక్‌లో పెరిగారని నేతల ధ్వజం
అన్నమయ్య డ్యాం వరదకు కొట్టుకుపోయినప్పుడు
కిక్కురుమనలేదంటూ నిప్పులు చెరిగిన మంత్రులు
క్రిమినల్ వెళ్లి మరో నేరస్థుడికి పరామర్శా అని ఎద్దేవా
అమరావతి/విజయవాడ, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ గుంటూరు జైలు వద్ద చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పరామర్శించిన జగన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపైన, సీఎం చంద్రబాబుపైనా విమర్శలు చేశారు. అయితే, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజులకే ఢిల్లీ వెళ్లిన జగన్ అక్కడ మాట్లాడు తూ.. రాష్ట్రంలో తమ పార్టీకి చెందిన వారిని వేటాడుతున్నారని, ఈ కొద్ది రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వ పక్షం స్పందించింది. జగన్ నిజాయితీపరుడైతే ఆయన చెబుతున్న 36 మంది పేర్లు, చిరునామాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయునప్పటికీ జగన్ స్పందించలేదు. సరిగ్గా అదే పద్ధతిలో బుధవారం కూడా మాట్లాడారు. విజయవాడ వరదల్లో 60 మంది మరణించారని, దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కూడా ప్రభుత్వ పక్షం సూటి ప్రశ్నలు సంధించింది. జగన్ చెప్పింది నిజమే అయితే ఆ 60 మంది పేర్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. జగన్ అబద్ధంతో జన్మించాడని, ఫేక్‌తో పెరిగాడని మంత్రి అనగాని సత్య ప్రసాద్ ధ్వజమెత్తారు. ‘జనం కష్టాల్లో ఉంటే వారిని పట్టించుకోకుండా జైలు కు వెళ్లి ఒక క్రిమినల్‌ను పరామర్శించారు విజయవాడలో 6 లక్షల మంది ప్రజలు వరదలో చిక్కుకోవడానికి జగన్ చేసిన పాపాలే కారణం’ అన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కడప లో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే కిక్కురుమనలేదని మం త్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి దుయ్యబట్టారు. ‘పింఛా నదికి వరదలు వస్తున్నట్టు తెలిసినా అన్నమయ్య డ్యాం గేట్లు ఎత్తలేదు. ఇసుక తవ్వుతున్న తమ పార్టీ మాఫియాకు ఇబ్బందని గేట్లు తెరవనీయకుండా ఆపారు. డ్యాం కొట్టుకుపోవడంతో 7 ఊళ్లు సర్వనాశనం అయ్యాయి. 38 మంది మరణించారు.
జనం ఇంకా గుడారాల్లోనే ఉంటున్నారు’ అన్నారు. నేరస్తుడు జగన్‌కు ప్రజల కష్టాలు పట్టించుకునే తీరికలేదు కానీ, జైలు లో ఉన్న నేరస్తులను మాత్రం పరామర్శించే తీరిక ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుడమేరు విస్తరణకు టీడీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి 70 శాతం పనులు పూర్తిచేసిందని, ఆ తరువాత తట్ట మట్టి కూడా వేయని జగన్ ఏముఖం పెట్టుకుని మాట్లాడతారని విమర్శించారు. ఏ కుట్రా లేకపోతే గుంటూరు జిల్లా వైపు ఉన్న బోట్లు ప్రకాశం బ్యారేజీకి ఎందుకు వచ్చాయని నిలదీశారు. జగన్ రాజకీయ జీవితానికి పుల్‌స్టాఫ్ పడిందని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. బ్యారేజీని బోట్లు ఢీకొనటం వెనుక రాజకీయ కుట్ర ఉందన్న అనుమానం మొదట జగన్ చెల్లెలు షర్మిలకే వచ్చిందన్నారు. జగన్ రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాఫ్ పడుతుందన్నారు. ‘జగన్‌కు నిజంగా కూటమి ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిందని నమ్మకం ఉంటే ఆయన పులివెందులకు రాజీనామా చేయాలి. నేను తిరువూరుకు రాజీనామా చేస్తా. ప్రజలు ఏం తీర్పు ఇస్తారో చూద్దాం. దమ్ముంటే ఆయన రావాలి’ అని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సవాల్ విసిరారు. కాగా, టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిని తానే ప్రోత్సహించానని జగన్ ఒప్పుకొన్నారని, ఆ కేసులో అసలు నేరస్తుడు జగనేనని అర్థమవుతోందని మంత్రి నారాయణ అన్నారు. జగన్‌ను ప్రధాన నిందితుడిగా ఎందుకు చేర్చకూడదని ప్రశ్నించారు.