రైతులు కోరుకున్న చోటే ప్లాట్లు
ABN , Publish Date - Sep 16 , 2024 | 03:21 AM
గతంలో రాజధానికి భూములు ఇవ్వని రైతులు సైతం నేడు స్వచ్ఛందంగా భూములిచ్చేందుకు ముందుకొస్తున్నారని రాష్ట్ర పురపాలక,
రాజధాని రైతులకు మంత్రి నారాయణ ఓపెన్ ఆఫర్
మంగళగరి, సెప్టెంబరు 15: గతంలో రాజధానికి భూములు ఇవ్వని రైతులు సైతం నేడు స్వచ్ఛందంగా భూములిచ్చేందుకు ముందుకొస్తున్నారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ పేర్కొన్నారు. అప్పట్లో భూములు ఇచ్చిన రైతులకు లాటరీ పద్దతిలో ప్లాట్లు ఇచ్చామని, ప్రస్తుతం కొంతమేర మాత్రమే భూముల అవసరం వుందని, ఇప్పుడు ఇచ్చే రైతులకు వరుస క్రమంలో వారు కోరుకున్న చోట్ల ప్లాట్లు కేటాయిస్తామని ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. గుంటూరు జిల్లా ఎర్రబాలెంలో ఆదివారం ఆయన పర్యటించారు. 11 మంది రైతులు ల్యాండ్ పూలింగ్ ద్వారా 12.27 ఎకరాల భూమి ఇచ్చారు. నారాయణ నేరుగా రైతుల ఇళ్లకు వెళ్లి ల్యాండ్ పూలింగ్ పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం రెండు విడతల వార్షిక కౌలు చెల్లింపు చేయలేదని, కూటమి ప్రభుత్వం రెండు రోజుల్లో ఒక విడత వార్షిక కౌలు చెల్లిస్తుందని, త్వరలోనే మరో విడత చెల్లిస్తామని తెలిపారు. భారీ వర్షాల కారణంగా రాజధానిలో నిలిచిన ముళ్లకంప తొలగింపు పనులను 2 రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. ఐఐటీ నిపుణుల నివేదిక రాజధాని నిర్మాణానికి అనుకూలంగా వచ్చిందని, దాని ఆధారంగా పనులు చేపడతామన్నారు.