వరద బాధితులకు టీడీపీ చేయూత
ABN , Publish Date - Sep 11 , 2024 | 11:57 PM
విజయవాడ వరద బాధితులకు సహాయం చేసేందుకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ చొరవచూపింది.
చంద్రబాబు ఆదేశాలతో ఇంటింటికీ వెళ్లిన నాయకులు
కర్నూలు(అర్బన), సెప్టెంబరు 11: విజయవాడ వరద బాధితులకు సహాయం చేసేందుకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ చొరవచూపింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరతతో పాటు ఎమ్మెల్యేలు, కీలక నాయకులు, కార్యకర్తలు బుధవారం వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడంతో రూ.కోటి విలువైన నిత్యావసర సరుకులను కర్నూలు నుంచి ఆరు లారీల్లో తీసుకెళ్లి వరద ప్రాంతాల్లోని బాధితులకు స్వయంగా అందజేశారు. విజయవాడ నగరంలోని ఊర్మిలా నగర్, జోజినగర్, బాంబేనగర్, సుబ్బారావు వీధి, గొల్లపూడి, వైఎస్సార్ కాలనీల్లో ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఎమ్మెల్యేలు జయనాగేశ్వర్ రెడ్డి, గౌరుచరిత, శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డిలు టీడీపీ నేతలతో కలసి వరద బాధితులకు నిత్యావసర వస్తువులతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి భరత మాట్లాడుతూ క్లిష్ణ పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడని తెలిపారు. వరద బాధితుల కోసం రూ.కోటి విలువైన 8 వేల కిట్లను పంపిణీ చేశామన్నారు. విజయవాడలో వరదలు రావడం బాధాకరమని, ఇలాంటి పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు రాత్రి, పగలు వారికి సేవలు అందిస్తున్నారన్నారు. ప్రస్తుత నాయకులు ఆయన ఆడుగు జాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ నాయకులు వరద బాధితులకు చేసిన సహయం ఏమీ లేదన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప ఏ ఒక్క బాధితుడికి ఎలాంటి సహాయం చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు వై.నాగేశ్వరరావు యాదవ్, ఆలూరు నేత వీరభద్రగౌడ్, నంద్యాల నాగేంద్ర, కార్పొరేటర్ పరమేష్, హనుమంతరావు చౌదరి, షేక్షావలి, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.