Share News

పెద్ద మనసుతో ఆదుకోండి

ABN , Publish Date - Sep 12 , 2024 | 03:35 AM

ఇది ఊహించని విపత్తు. సాధారణం నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. ఎగువ రాష్ట్రాల నుంచి వరద వెల్లువెత్తడంతో ఏరులు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి.

పెద్ద మనసుతో ఆదుకోండి

కేంద్ర బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం వినతి

నష్టం ప్రాథమిక అంచనాలే 6,800 కోట్లు

ఎన్యుమరేషన్‌ తర్వాత మరింత పెరిగే చాన్స్‌

సిసోడియా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

తొలిరోజు రెండు జిల్లాల్లో బృందాల పర్యటన

కనీసం 10 వేల కోట్లు మంజూరు చేయండి

కేంద్ర బృందానికి రైతు సంఘాల వినతి

అమరావతి/మచిలీపట్నం/బాపట్ల, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): ‘ఇది ఊహించని విపత్తు. సాధారణం నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. ఎగువ రాష్ట్రాల నుంచి వరద వెల్లువెత్తడంతో ఏరులు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఊళ్లు, పట్టణాలు, నగరాలను వరద ముంచెత్తింది. తేరుకునేలోపే నిండా ముంచే సింది. ప్రజల ప్రాణాలు కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలు పనిచేసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం నష్టం రూ.6,880కోట్లు పైమాటే. ఎన్యుమరేషన్‌ పూర్తయితే నష్టం విలువ అపారంగా ఉంటుంది. మీరూ పరిశీలన చేసి, నష్టాన్ని అంచనా వేయండి. పెద్ద మనుసుతో రాష్ట్రాన్ని ఆదుకునేందుకు సాయం చేయండి’ అని కేంద్ర బృందాలను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. బుధవారం తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో కీలక భేటీ జరిగింది. నాలుగు జిల్లాల్లో వరద నష్టం అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్‌ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని అధికారుల బృందంతో రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల కీలక అధికారులు సమావేశమయ్యారు. రెవెన్యూ, విపత్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.పి. సిసోడియా వరద నష్టంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముంపు సమయంలో, ప్రస్తుత పరిస్థితులను తెలియజేసేలా ఏర్పాటుచేసిన వీడియో, ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర అధికారులు పరిశీలించారు.

వరద పీడిత ప్రాంతాల్లో ప్రాథమిక అంచనాల ప్రకారం రూ. 6,880 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి సిసోడియా నివేదించారు. సమగ్ర నష్టాన్ని అంచనా వేసేందుకు సర్వే జరుగుతోందని, అది పూర్తయ్యాక మొత్తం నష్టం విలువ అపారంగా ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క విజయవాడ నగరంలోనే 32 వార్డులు, దాని పక్కనే 2గ్రామాలతో పాటు 10.63లక్షల మంది తీవ్రంగా ప్రభావితమయ్యాయని తెలిపారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని 108 మండలాలు, 337 గ్రామాలపై ప్రభావం పడిందని చెప్పారు. 246 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి 50వేల మందిని తరలించామని, లక్షన్నర మందికి అత్యవసర వైద్యసేవలు అందించామని వివరించారు. వరదల వల్ల 3లక్షల మంది రైతులకు చెందిన 2.06 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు నివేదించారు. 19,686 హెక్టార్లలో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. 4వేల కి.మీ. పరిధిలో రహదారులు దెబ్బతిన్నాయని, దీనివల్ల రూ.వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఆర్‌అండ్‌బీ ప్రజెంటేషన్‌ ఇచ్చింది.

కేంద్ర బృందానికి రైతు సంఘాల వినతిపత్రం

బుడమేరు, కృష్ణా వరద ప్రభావిత ప్రాంతాలను ఆదుకోవడానికి కనీసం రూ.10వేల కోట్లు మంజూరు చేయాలని కేంద్ర బృందానికి ఏపీ రైతుసంఘాల సమన్వయ సమితి విజ్ఞప్తి చేసింది. మద్దూరులో మాజీమంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావు, రైతుసంఘాల నాయకులు కేంద్రబృందానికి వినతిపత్రం అందజేశారు. పామర్రు, గుడివాడ, పెనమలూరు నియోజకవర్గాల్లో బుధవారం కేంద్ర బృందం అనిల్‌ సుబ్రహ్మణ్యం, రాకేశ్‌కుమార్‌, ఎస్‌వీఎ్‌సపీ శర్మ పర్యటించారు. కృష్ణా కలెక్టర్‌ డీకే బాలాజీ వారికి పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌, ఫొటో ఎగ్జిబిషన్‌ ద్వారా జిల్లాలో జరిగిన నష్టాన్ని వివరించారు. కాగా, బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలతో పాటు ముంపు ప్రాంతాల్లో మినిస్ట్రీ ఆఫ్‌ అగ్రికల్చర్‌కు చెందిన డైరెక్టర్‌ వాఘ్‌మెర్‌, ఆర్థికశాఖ కన్సల్టెంట్‌ కౌల్‌, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ కార్యదర్శి ప్రదీ్‌పకుమార్‌ పర్యటించారు. కేంద్ర బృందం కాన్వాయ్‌ చింతల్లంక, పెసర్లంక గ్రామాల్లోకి రాగానే మహిళలు అడ్డుగా నిలబడి డ్వాక్రా రుణాలతో పాటు పంట రుణాల విషయంలో వెసులుబాటు కల్పించాలని అభ్యర్థించారు. ఇప్పటికే ఈ అంశంపై సీఎం స్పష్టమై ఆదేశాలు ఇచ్చారని, బ్యాంకర్లతో మాట్లాడి మరింత న్యాయం జరిగేలా చూస్తామని కలెక్టర్‌ హామీ ఇవ్వడంతో కాన్వాయ్‌కి దారివదిలారు.

బుడమేరు ముంచింది

ఎన్టీఆర్‌ జిల్లా, కృష్ణా డెల్టాడమీదుగా కొల్లేరు సరస్సులో కలిసే బుడమేరు ఉప్పొంగిన కారణంగానే విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని సిసోడియా ప్రజెంటేషన్‌ ఇచ్చారు. బుడమేరకు సామర్థ్యానికి మించి వరద రావడం, గండ్లు పడటం, వరద ప్రవాహానికి ఆటంకాలు కలగడం, ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద రావడం వంటి కారణాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వివరించారు. ప్రజల ఆస్తులు, పంటలు, రోడ్లు, విద్యుత్‌, ఇరిగేషన్‌ వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయని ఫొటోలు, వీడియోలను ప్రదర్శించారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం పది రోజులుగా అహర్నిశలూ పనిచేసిందని తెలిపారు. 26 ఎన్‌డీఆర్‌ఎఫ్‌, 22 ఎస్‌డీఆర్‌ఎఫ్‌, 2 నేవీ బృందాలు, 6హెలికాప్టర్‌లు, 212 బోట్లు, 488మంది గజ ఈతగాళ్లు, 606 ట్రాక్టర్లు, 330 బస్సులు, 92 ఆటో రిక్షాలు, 162 చిన్న, పెద్ద వాహనాలు, 32 జేసీబీలు, 188 టిప్పర్లు, ట్యాంకర్లు, 59 డ్రోన్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. వరద బాధితులకు హెలికాప్టర్‌, డ్రోన్ల సాయంతో మూడు పూటలా ఆహారం అందించామని చెప్పారు. 2.06లక్షల కుటుంబాలకు నిత్యావరాలు పంపిణీ చేశామని, విద్యుత్తు, తాగునీటి సరఫరాను పునరుద్ధరించామని చెప్పారు.

Updated Date - Sep 12 , 2024 | 03:36 AM