ఆగిన తల్లి గుండె
ABN , Publish Date - Oct 20 , 2024 | 10:58 PM
ఆగిన తల్లి గుండెతో ఆ చిన్నారులు అనాథలయ్యారు. రెండేళ్ల క్రితం తండ్రిపోయిన తల్లి నీడన పెరిగారు.
రెండేళ్ల క్రితమే గుండెపోటుతో తండ్రి మృతి
తల్లి మృతితో అనాథలైన పిల్లలు
పత్తికొండ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ఆగిన తల్లి గుండెతో ఆ చిన్నారులు అనాథలయ్యారు. రెండేళ్ల క్రితం తండ్రిపోయిన తల్లి నీడన పెరిగారు. ఆమె కూడా మృతి చెందడంతో దిక్కులేనివారయ్యారు. పత్తికొండ మండల పరిధిలోని చందోలి గ్రామానికి చెందిన మద్దిలేటి, రంగమ్మలకు లక్ష్మి, మధులు సంతానం. తుగ్గలి మండలం మారెళ్లకు చెందిన దుప్పటి అంజికి లక్ష్మిని 15 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి జయశ్రీ, అంకిత, ఉషశ్రీ కూతుళ్లు సంతానం. రెండేళ్ల క్రితం తండ్రి అంజి మృతి చెందాడు. మెట్టినింట్లో ఎవరూ ఆదరించే పరిస్థితి లేకపోవడంతో ముగ్గురు ఆడ కూతుళ్లను తీసుకుని లక్ష్మి పుట్టినిల్లయిన చందోలికి చేరుకుంది. తల్లి వద్ద ఉంటూ కూలి పనులు చేస్తూ పిల్లలను పోషించుకుంటోంది. స్థానిక పాఠశాలలో పిల్లలు చదువుకుంటున్నారు. లక్ష్మి ఆదివారం గుండెపోటుతో మృతి చెందడంతో ఆ చిన్నారులు అనాథలుగా మిగిలారు. అమ్మమ్మ ఉన్నా ఆమె వీరిని పోషించే పరిస్థితి లేదు. ఇదేమీ తెలియని చిన్నారులు మృతి చెందిన తల్లి మృతదేహం వద్ద కూర్చొని ఏడుస్తున్న దృశ్యం పలువురిని కంటతడి పెట్టించింది. వీరిలో ఐదేళ్లు ఉన్న కూతురు ఉషశ్రీ అమ్మా.. లే అమ్మ అంటూ పిలవడం పలువురి హృదయాలను కలిచివేసింది. ప్రభుత్వం చిన్నారులను ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.