తడిచిన వరిపనలు
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:16 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారింది. ఆ ప్రభావంతో శుక్రవారం జిల్లా అంతటా చిరుజల్లులు కురిశాయి. మరోవైపు పొలాల్లో వరిపనలు తడిచి ముద్దకాగా.. పంటకుప్పల కిందకు నీరు చేరింది. ఇక రోడ్లు, కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం కాపాడుకునేందుకు రైతులు ఇక్కట్లు పడుతున్నారు.
- నీరు బయటకు మళ్లించేందుకు పాట్లు
- ధాన్యం రాశులను కాపాడేందుకు ఇక్కట్లు
- తుఫాన్ ప్రభావంతో జిల్లాలో వర్షాలు
- నష్టం తప్పదంటున్న రైతులు
నరసన్నపేట, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారింది. ఆ ప్రభావంతో శుక్రవారం జిల్లా అంతటా చిరుజల్లులు కురిశాయి. మరోవైపు పొలాల్లో వరిపనలు తడిచి ముద్దకాగా.. పంటకుప్పల కిందకు నీరు చేరింది. ఇక రోడ్లు, కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం కాపాడుకునేందుకు రైతులు ఇక్కట్లు పడుతున్నారు. తడి ధాన్యంమీద టార్పాన్లు వేయడంతో రంగు మారుతాయన్న ఆందోళనలో ఉన్నారు. జిల్లాలో ఈఏడాది ఖరీప్‌లో 3.65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. దాదాపు 80 శాతం వరికోతలు కాగా.. వ్యవసాయ అధికారులు లెక్కల ప్రకారం 50శాతం మేరకు పొలాల్లో కుప్పలు పెట్టగా.. 35వేల మెట్రిక్ టన్నులు కల్లాల్లో ఉన్నాయి. మరో 30 వేల ఎకరాల్లో వరిపనలు పొలాల్లో ఉన్నాయి. నరసన్నపేట, పోలాకి, జలుమూరు, గార, టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, సారవకోట, ఎల్‌ఎన్‌పేట, సరుబుజ్జిలి, శ్రీకాకుళం రూరల్, హిరమండలం మండలాల్లో కోతలు పూర్తయి పొలాల్లోనే వరిపనలు ఉన్నాయి. తుఫాన్ అలర్ట్‌తో భారీ యంత్రాలతో కోత, నూర్పుడి చేసిన రైతులు పచ్చి ధాన్యంను కల్లాల్లో రాశులు పోశారు. కొన్నిచోట్ల వరిపనల కిందకు నీరు చేరడంతో బయటకు మళ్లించేందుకు అవస్థలు పడుతున్నారు.
ఇంకా రెండురోజులు వర్షాలు
తుఫాన్ ప్రభావంతో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తేమ శాతం 17 నుంచి 24 వరకు ఉన్నా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. తడిసిన ధాన్యం కోనుగోలుపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఆదివారం వరకు వర్షాలు పడితే ధాన్యం రంగు మారుతుందని ఆందోళన చెందుతున్నారు.
- ఎల్.ఎన్.పేట: చింతలబడవంజ, డొంకలబడవంజ, కొత్తపేట, కవిటి, పూశాం, రావిచెంద్రి, ధనుకువాడ, కోవిలాం, చిట్టిమండలం, తురకపేట, క్రిష్ణాపురం తదితర గ్రామాల్లో ధాన్యం రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికందివచ్చిన పంటలను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలను చేస్తున్నారు. వరిచేలు కుప్పలపై గడ్డివేసి కప్పటమే కాకుండా టార్బాలిన్లు వేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ధాన్యం తడిచి రంగుమారే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
- జి.సిగడాం: మధ్యాహ్నం నుంచి చిరుజల్లులుతో కూడిన వర్షం పడటంతో రైతులు అందోళన చెందుతున్నారు. కోసిన పంటను దిబ్బలుగా వేశారు. నూర్పిడి చేసిన ధాన్యాన్ని బస్తాలకు పట్టి షెడ్‌లలో భద్రపరచటంతో పాటు మిల్లులకు పంపించే పనిలో రైతులు నిమగ్నమయ్యారు.
ముందుకొచ్చిన సముద్రం
గార: తుఫాన్ కారణంగా బందరువానిపేట వద్ద సముద్రం సుమారు 20 మీటర్లు ముందుకు రావడంతో ఒడ్డున ఉన్న పడవలు, వలలు మునిగిపోయాయి. అధికారులు హెచ్చరికలతో ముందే మత్స్యకారులు వాటిని సురక్షిత ప్రదేశంలో భద్రపరిచినా శుక్రవారం ఉదయం సముద్రపు అలలు ఎగిసిపడి ముందుకురావడంతో అవి మునిగిపోయాయి.
- టెక్కలి: ఫంగల్ తుఫాన్ రైతుల్ని వణికిస్తోంది. శుక్రవారం రోజంతా చిరుజల్లులు కురవడంతో పంటను చివరిదశలో రక్షించుకునేందుకు పొలాల్లో పడిగాపులు కాశారు. కొందరు నూర్చిన ధాన్యాన్ని పోగులు చేశారు. మరికొందరు కుప్పలపై తార్పాన్లు కప్పారు. తీరప్రాంతవాసులకు అప్రమత్తం చేసినట్లు ఆర్డీవో ఎం.క్రిష్ణమూర్తి అన్నారు. ఇప్పటికే సంతబొమ్మాళి మండలంలో మత్సకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా ఉండేందుకు దండోరా వేయించామని తెలిపారు. అలాగే మండల, సబ్‌కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు.
- కంచిలి: ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కలిపి ఇప్పటివరకు పది శాతం మాత్రమే కోతలు జరిగినట్లు వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. కంచిలి మండలంలోని 126 ఎకరాలు, ఇచ్ఛాపురంలో 98 ఎకరాలు, సోంపేటలో 186 ఎకరాలు, కవిటి మండలంలో 10ఎకరాల్లో మాత్రమే కోతలు పూర్తయినట్లు తెలిపారు. వరి కోతలు పూర్తయిన చోట పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
- జలుమూరు: మండలంలో శుక్రవారం చిరుజల్లులు పడడంతో ధాన్యాన్ని భద్రపరచుకోడానికి రైతులు కష్టాలు పడుతున్నారు. పంట చేతికందే సమయంలో వర్షాలు పడుతుండడంతో వారు ఆందోళన చెందుతున్నారు.
- పలాసరూరల్: ఈదురుగాలులతో పాటు చిన్నపాటి చినుకులు పడడంతో పలాస మండల రైతులు పంటచేనును కుప్పలుగా ఎత్తి వాటిపై టార్పాన్లు కప్పారు. రెంటికోట, అల్లుకోల, కాంట్రగడ, లొత్తూరు, దానగొర, హిమగిరి, కైజోల, కొత్తూరుతో పాటు ఉద్దాన ప్రాంతాల్లో రైతులు వరి పంటను రక్షణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
- పోలాకి: ఉదయం వాతావరణం పొడిగా ఉండడంతో వరిచేలను ఇంటికి, కల్లానికి తెచ్చేపనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. వెంటనే వర్షం కురవడంతో ఎక్కడిపనులు అక్కడ నిలిపివేశారు. పొలాల్లోనే వరికుప్పలుపెట్టి టార్పాన్లు కప్పారు. వర్షం ఎడతెరిపిలేకుండా కురుస్తూనే ఉంది.