సాగునీటి ప్రాజెక్టులు బాగుపడేనా?
ABN , Publish Date - Oct 31 , 2024 | 12:45 AM
మందస మండలంలోని కళింగదల్, డబార్సింగి, దామోదర సాగర్ ప్రాజెక్టులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కోట్లాది రూపాయల వ్యయంతో పురుడు పోసుకొని లక్షలాది మంది రైతులకు సంజీవినిగా మారిన ఈ ప్రాజెక్టులు వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి.
- గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యం
- రూపాయి కూడా విదల్చని వైనం
- సాగునీటికి తప్పని ఇబ్బందులు
- సీఎం చంద్రబాబుపైన రైతుల ఆశలు
హరిపురం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మందస మండలంలోని కళింగదల్, డబార్సింగి, దామోదర సాగర్ ప్రాజెక్టులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కోట్లాది రూపాయల వ్యయంతో పురుడు పోసుకొని లక్షలాది మంది రైతులకు సంజీవినిగా మారిన ఈ ప్రాజెక్టులు వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. గత ఐదేళ్ల పాటు నిర్వహణకు నోచుకోక మరమ్మతులకు గురై మూలుగుతున్నాయి. షట్టర్లు, రిటైనింగ్ వాల్‌లు, మదుములు, స్లూయిస్‌లు సైతం బీటలు వారి కూలిపోయే స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. కాలువల్లో పిచ్చిమొక్కలు, ముళ్లపొదలతో నిండిపోయి శివారు భూములకు సాగునీరందని దైన్యపరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు తొలిసారి జిల్లా పర్యటనకు శుక్రవారం వస్తున్నారు. దీంతో రిజర్వాయర్ల మరమ్మతులకు నిధుల వర్షం కురిపిస్తారని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ప్రాజెక్టు పేరు: కళింగదల్
ఆయకట్టు: 2,520 హెక్టార్లు
సాగునీరందించే మండలం: మందస
ప్రస్తుత స్థితి: మండలంలో అతిపెద్ద అత్యధిక ఆయకట్టు ఉన్న రిజర్వాయర్ ఇది. నిర్మించి రెండు దశాబ్దాలు గడిచింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు నిర్వహణను గాలికొదిలేశారు. గత ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. దీంతో మరమ్మతులు జరగక.. షట్టర్లు విరిగి, కాలువలు మేట వేసి నీరు రాని దుస్థితి నెలకొంది. రిటైనింగ్ వాల్‌లు, సరప్లస్ వాల్‌లు కూలిపోయే స్థితికి చేరుకున్నాయి. సవరపద్మాపురం, కృష్ణాపురం, గౌడుగురండి వంటి శివారు గ్రామాలకు నీరందడం లేదు. దీంతో ఆయా గ్రామాలు కరవు కోరల్లో చిక్కుకున్నాయి.
ప్రాజెక్టు పేరు: డబార్సింగి
ఆయకట్టు: 1,112 హెక్టార్లు
సాగునీందించే మండలం: మందస
ప్రస్తుత స్థితి: దశాబ్దం కిందట ఈ రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. పనులు అంతా అరకొరే. కాలువలు నిర్మించినా ఏడాదికే రూపం కోల్పోయాయి. సుమారు 18 గ్రామాల పరిధిలోని 1,112 హెక్టార్ల ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం కనీసం 10 గ్రామాలకు నీరందని దుస్థితి. రిజర్వాయర్ నిర్మాణ దశలోనే ప్రతిపాదనలు మారి, డిజైనింగ్ కూడా మారింది. దీంతో నీరు నిలువ ఉండ ని పరిస్థితి ఉంది. రిటైనింగ్ వాల్‌లో రాళ్లు కూలిపోయి ప్రమాదకర పరిస్థితి నెలకొంది. షట్టర్లు మూసుకోక కాలువల వెంబడి నిరంతరం నీరు వృథాగా పోతుంది.
ప్రాజెక్టుపేరు: దామోదర సాగరం
ఆయకట్టు: 1,225 హెక్టార్లు
మండలం: మందస
ప్రస్తుత స్థితి: నిర్మించి 12ఏళ్లు అయింది. రూ.2.24కోట్ల వ్యయంతో నిర్మించి కాలువలు తవ్వలేదు. దీంతో ఖర్చు అయిన నిఽధులు బూడిదలో పోసిన పన్నీరైంది. సిమెంటు నిర్మాణల్లోనూ నాణ్యతా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మదుములు, తూములు నిర్మించిన ఏడాదికే బీటలు వారాయి. దీంతో షట్టర్లు తెరుచుకోక, తెరిస్తే మూసుకోక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. 1,225 హెక్టార్ల ఆయకట్టు కేవలం కాగితాలకే పరిమితమైంది. దీంతో శివారు భూములకు నీరందక కనీసం ఒక్క పంటకూడా పూర్తి స్థాయిలో పండించలేని పరిస్థితి రైతులది.
ఉద్దానం ప్రాజెక్టు..
పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలో సుమారు 297గ్రామాలకు తాగునీరందించే ఉద్దానం ప్రాజెక్టును గత ఐదేళ్లుగా కనీసం పట్టించుకొనే నాథుడే లేడు. కనీస మరమ్మతులకు నోచుకోవడం లేదు. ప్రాజెక్టులో పనిచేసే సిబ్బందికి ఏడాది జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పరిష్కరించి ఆదుకోవాలని ఉద్దానం ప్రజలు, సిబ్బంది కోరుతున్నారు.