అందరూ చూస్తుండగానే..
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:10 AM
జనమంతా చూస్తుండగానే కాశీబుగ్గకు చెందిన చిత్తరెడ్డి సంతోషి మెడలోని పుస్తెలతాడును ఇద్దరు అగంతకులు బైక్‌పై వచ్చి చోరీ చేసిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.
- బైక్‌పై వచ్చి మహిళ మెడలో పుస్తెలతాడు చోరీ
పలాస: జనమంతా చూస్తుండగానే కాశీబుగ్గకు చెందిన చిత్తరెడ్డి సంతోషి మెడలోని పుస్తెలతాడును ఇద్దరు అగంతకులు బైక్‌పై వచ్చి చోరీ చేసిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వెంటనే స్థానికులు బైక్‌ను అనుసరించినా వారు స్పీడ్‌గా వెళ్లిపోవడంతో పట్టుకోలేకపోయారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సంతోషి స్థానిక అన్నపూర్ణ థియేటర్ రోడ్డులో ఉన్న జీడి పరిశ్రమలో పనిచేస్తోంది. విధులు ముగించుకొని సాయంత్రం 6.30 గంటల ప్రాం తంలో ఇంటికి కాలినడకన వస్తుండగా.. కేటీ రోడ్డు ఎస్‌ఆర్ షాపింగ్ మాల్ దాటిన తరువాత ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ముసుగు ధరించి ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె మెడలో పుస్తెలతాడును లాక్కెళ్లారు. ఆమె వెంటనే తేరుకొని తాడు కింద ఉన్న పుస్తెలను గట్టిగా పట్టుకోవడంతో అవి చేతిలో ఉండిపోయాయి. మిగిలిన 20 గ్రాముల బంగారం తాడు చోరీకి గురైంది. ఆమె కేకలు వేయగా స్థానికులు వారిని వెంబడించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఐ డి.మోహనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బెండిగేటు కూడలి వద్ద..
వజ్రపుకొత్తూరు: ఉద్దానం మెళియాపుట్టికి చెందిన బొమ్మాళి సరోజనమ్మ మెడలోని బంగారం గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు లాక్కొని వెళ్లిపోయినట్లు ఏఎస్‌ఐ జూన్నారావు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. మంగళవారం ఉద యం ఉద్దానం మెళియాపుట్టి నుంచి పలాస మండలం గరుడిఖండికి బొమ్మాళి లక్ష్మయ్య, భార్య సరోజనమ్మ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా బెండిగేటు కూడలి వద్ద గుర్తుతెలియని యువకుడు ఆమె మెడలోని సుమారు తులంన్నర బంగారం చైన్‌నుతెంపుకొని వెళ్లిపోయాడు. వెంటనే అతడి కోసం చుట్టుపక్కల వారు గాలించి నా అప్పటికే పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితురాలు సరోజనమ్మ ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ తెలిపారు.
కొర్లాం వద్ద హైవేపై..
సోంపేట: కొర్లాం హైవే వద్ద ఓ మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు మూడు తులాల బంగారు గొలుసును అపహరించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొర్లాం గ్రామానికి చెందిన కె.పుణ్యావతి మంగళవారం పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తుంది. ఆ సమయంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసు అపహరించుకుపోయారు. బాధితురాలు పుణ్యావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సోంపేట సీఐ మంగరాజు తెలిపారు.
గర్భిణిపై దాడి.. కేసు నమోదు
టెక్కలి: రావివలసలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణతో ఓ గర్భిణిపై మరో కుటుంబం దాడి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రావివలస పాతకాలనీకి చెందిన బి.శేఖర్, లక్ష్మి, శేఖర్ సోదరుడిపై అదే వీధికి చెందిన వేరే కుటుంబం మధ్య స్వల్పఘర్షణ జరగడంతో చివరకు కొట్లాటకు దారితీసింది. దీంతో గాయపడిన శేఖర్, లక్ష్మిలను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో గాయపడిన లక్ష్మి నాలుగు నెలల గర్భిణి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.