రైలు మార్గాల్లో.. గంజాయి రవాణా
ABN , Publish Date - Sep 15 , 2024 | 11:57 PM
గంజాయికి కేరాఫ్‌గా నిలిచిన ఒడిశా నుంచి పలాస మీదుగా జిల్లాకు రవాణా సాగుతోంది. ఒడిశా రాష్ట్రం ఆర్.ఉదయగిరి, మహేంద్రగిరి ఒడిశా ప్రాంతంలో గంజాయి ఎక్కువగా పండిస్తున్నారు. ఎకరాకు రూ.10 లక్షల వరకు ఆదాయం వస్తుంది. దీన్నే ప్రధాన ఆదాయ వనరుగా ఏడాదికి రెండు పంటలు పండిస్తున్నారు.
పలాస మీదుగానే.. తరలింపు
(పలాస)
గంజాయికి కేరాఫ్‌గా నిలిచిన ఒడిశా నుంచి పలాస మీదుగా జిల్లాకు రవాణా సాగుతోంది. ఒడిశా రాష్ట్రం ఆర్.ఉదయగిరి, మహేంద్రగిరి ఒడిశా ప్రాంతంలో గంజాయి ఎక్కువగా పండిస్తున్నారు. ఎకరాకు రూ.10 లక్షల వరకు ఆదాయం వస్తుంది. దీన్నే ప్రధాన ఆదాయ వనరుగా ఏడాదికి రెండు పంటలు పండిస్తున్నారు. రైలు మార్గాల ద్వారా అధికంగా గంజాయి రవాణా సాగిస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలోని గంజాం, ఛత్రపూర్, బర్హంపూర్ వంటి రైల్వేస్టేషన్లలో గంజాయిని ఎక్కించి.. వివిధ ప్రాంతాలకు తరలిస్తుంటారు. రైలులో ఎక్కువగా కొత్త సూట్‌కేసుల్లోనే రవాణా చేస్తుండడంతో ఎవరికీ అనుమానాలు కూడా కలగడం లేదు. జీడిపప్పు ముసుగులో కూడా గంజాయి, ఎర్రచందనం రవాణా అవుతుందనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం ఆరు నెలల కాలంలో పలాస, ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ల వద్ద గంజాయితో పట్టుబడిన సంఘటనలు అనేకంగా ఉన్నాయి.
- 2009లో ఏకంగా రైల్వే ప్రొటక్షన్‌ఫోర్స్(ఆర్పీఎఫ్) అధికారి ఒకరు గంజాయి రవాణా చేస్తు రైల్వే పోలీసులకు పట్టుబడడం.. అప్పట్లో సంచలనమైంది. ఆర్పీఎఫ్ అధికారి తన కార్యాలయం కేంద్రం ఒడిశా నుంచి గంజాయి తెచ్చి ఇక్కడే ప్యాకింగ్ చేస్తు రైలులో ప్రయాణించే హాకర్లు, బెగ్గర్‌ల ద్వారా ముంబాయి, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు రవాణా చేస్తుండేవాడు. ఈ విషయం పసిగట్టిన రైల్వే పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో అసలు విషయం బయటపడింది.
- అంతకు ముందు పలాస జాతీయరహదారిపై కాశీబుగ్గ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఆయల్ ట్యాంకరులో గంజాయి తరలిస్తున్న విషయాన్ని గుర్తించి అరెస్ట్ చేశారు. సుమారు 800 కిలోల గంజాయి పలాసలోనే పట్టుబడింది.
- కొన్నాళ్ల కిందట పలాస ఆర్పీఎఫ్ సిబ్బంది ఇద్దరు ఇచ్ఛాపురం వద్ద గంజాయి రవాణాదారులకు సహకరించి పట్టుబడడంతో వారిపై కేసులు నమోదయ్యాయి. కొద్ది రోజుల క్రితం పలాస రైల్వే స్టేషన్‌రోడ్డులో ఇద్దరు అనుమానితులను పట్టుకోగా గంజాయి నిల్వలు లభించాయి. మరో కేసులో గంజాయిని విడిచి ఇద్దరు వ్యక్తులు పరారీ కాగా కాశీబుగ్గ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
- పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లో గంజాయి బ్యాచ్‌లు ఇటీవల అధికమయ్యాయి. రైల్వేకాలనీ, నర్సిపురం, అక్కుపల్లి రోడ్, పారిశ్రామికవాడ ప్రాంతాల్లో గంజాయి సేవిస్తూ.. అటుగా వెళ్తున్న వారిపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఒడిశా నుంచి నిత్యం ఓ ముఠా వీరికి గంజాయి సరఫరా చేస్తుందనే ప్రచారం ఉంది. ఒడిశా సరిహద్దు మార్గాల్లో రాత్రులు కూడా నిఘా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఒడిశా నుంచి వచ్చే రైళ్లతో పాటు ఇచ్ఛాపురం, మందస, పలాస, మెళియాపుట్టి, పాతపట్నం ప్రాంతాల్లో ఉన్న సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తే గంజాయి రవాణాకు అడ్డుకట్ట పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.