ఆలయాలే వీరి టార్గెట్
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:58 PM
అంతర్రాష్ట్ర దొంగల ముఠా పోలీసులకు పట్టుబడింది. జిల్లాలో కొన్నాళ్ల నుంచి ఆలయాల్లో వరుస చోరీల వెనుక ఈ ముఠా హస్తం ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో మొత్తం 39 కేసుల్లో రూ.91.38 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనాలు, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
- 31 గుడులు, ఒకచర్చిలో చోరీలు
- 4 ఇళ్లు, 3 రైస్ మిల్లుల్లో కూడా..
- అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
- రూ.91.38 లక్షల ఆభరణాలు, వాహనాలు, నగదు స్వాధీనం
శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 1: అంతర్రాష్ట్ర దొంగల ముఠా పోలీసులకు పట్టుబడింది. జిల్లాలో కొన్నాళ్ల నుంచి ఆలయాల్లో వరుస చోరీల వెనుక ఈ ముఠా హస్తం ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో మొత్తం 39 కేసుల్లో రూ.91.38 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనాలు, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ముఠాలో తొమ్మిది మంది ఉండగా.. ఆరుగురిని అరెస్టు చేశారు. మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. శ్రీకాకుళంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నిర్వహించన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ మహేశ్వరరెడ్డి వెల్లడించారు.
‘జిల్లాలో పొందూరు మండలం నందివాడలో దుర్గామాత ఆలయం, ఎచ్చెర్ల మండలం కుంచాల కురమయ్యపేటలో శ్రీచక్రాలయం, కోటబొమ్మాళిలో సాయిబాబా ఆలయం, శివాలయం, గార మండలంలో శ్రీ వెంకటేశ్వర, సాయిబాబా ఆలయాల్లో, శ్రీకాకుళంలో ఆమ్మవారి ఆలయంతో పాటు పలు ఆలయాల్లో ఇటీవల చోరీలు జరిగాయి. వాటిని ఛేదించేందుకు శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో రణస్థలం సీఐ అవతారంతోపాటు మరో 8 మందితో ప్రత్యేక బృందాన్ని నియమించాం. తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా మణిపూర్‌కి చెందిన బట్టిన శ్రీకాంత్ పండ్ల రవాణా వ్యాపారం చేస్తూ ఎల్.ఎన్.పేటకు చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతడికి హిరమండలం మండలం గుర్రాలమెట్టకు చెందిన సవర సూర్యంతో పరిచయమైంది. సూర్యం 2019లో ఒడిశాలో ఓ మొబైల్ షాపులో దొంగతనం చేసి పోలీసులకు చిక్కాడు. అలాగే మద్యం దుకాణాల్లో కూడా దొంగతనాలు చేశాడు. వీరిద్దరు కలిసి స్థానికంగా యువకులను పరిచయం చేసుకుని.. వారికి డబ్బు ఆశ చూపించి మొత్తం 9 మంది ఒక గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. జిల్లాలో 2021 నుంచి దొంగతనాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 23న ఎచ్చెర్ల మండలంలోని కుంచాల కురమయ్యపేటలో శ్రీ రాజరాజేశ్వరీ శక్తి పీఠంలో జరిగిన దొంగతనం కేసు రణస్థలం సీఐ విచారించగా.. ఈ అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టయింది. దొంగల గ్యాంగ్‌కి సవర సూర్యం లీడర్‌గా వ్యవహరించగా, శ్రీకాంత్, ఎల్.ఎన్.పేట మండలం గొట్టిపల్లికి చెందిన కూరమాన శ్రీనివాసరావు, జోగివలసకి చెందిన సవర సిపన్య, గుర్రాలమెట్టకు చెందిన సవర చిన్నారావులు చోరీలకు సహకరిస్తున్నట్టు విచారణలో గుర్తించాం. వీరితోపాటు ఎల్.ఎన్.పేట మండలం కరిగుడకి చెందిన సవర భోగేష్, సిద్ధు, కొత్తూరు మండలం అడ్డాయిగూడకి చెందిన సవర మల్లేశ్వరరావు, చోరీలకు పాల్పడ్డారు. శీచక్రాలయంలో చోరీ కేసు విచారిస్తుండగా అజరాం రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న శ్రీనివాసరావు, సిపాన్య, మల్లేశ్వరరావు, భోగేష్, సిద్ధు కనిపించారు. వారిని సీఐ అవతారం విచారించగా నేరాలు అంగీకరించారు. వీరంతా 31 దేవాలయాలు, 4 ఇళ్లు, ఒక చర్చి, 3 రైస్ మిల్లుల్లో దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నారు. మన్యం జిల్లా సీతంపేటకి చెందిన కాకినాడ కృష్ణారావుకి దొంగిలించిన బంగారం అమ్మినట్లు చెప్పారు. ఈ చోరీ కేసుల్లో రూ.91.38లక్షల విలువైన 692 గ్రాముల బంగారు ఆభరణాలు, 52.880 కేజీల వెండి, రూ.3,38,570 నగదు, నాలుగు బైక్‌లు, రెండు కట్టర్‌లు రికవరీ చేశాం. చోరీకి పాల్పడిన శ్రీనివాసరావు, సిపాన్య, మల్లేశ్వరరావు, భోగేష్, సిద్ధులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాం. దొంగ బంగారం కొన్న కాకినాడ కృష్ణారావును కూడా అరెస్ట్ చేశాం. సూర్యం, చిన్నారావు, శ్రీకాంత్ కోసం గాలిస్తున్నాం. దొంగతనాలకు పాల్పడిన ఈ తొమ్మిది మందిపై ఆంధ్రా, తెలంగాణల్లో 43 కేసులు ఉన్నాయి’ అని ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్న డీఎస్పీ వివేకానంద, సీఐ అవతారం, క్రైం సిబ్బంది ని ప్రత్యేకంగా అభినందించారు.